చిలిపిచెడ్, నవంబర్ 10: మారిన పరిస్థితుల్లో వ్యవసా యం రైతుకు గుదిబండగా మారింది. సాగులో నష్టాలు, కష్టాలు సర్వసాధారణంగా మారింది. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగుముందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్టుబడి కొండంత… దిగుబడి, రాబడి మాత్రం గోరంతగా మా రింది. అయితే, అధునిక పద్ధతులు పాటిస్తూ సాగును బంగా రు బాటగా మార్చుకున్నాడు. రైతులు ప్రత్యామ్నాయ పంట లపై దృష్టి పెట్టారు. చిలిపిచెడ్ మండలంలోని రైతులు ఆకుకూరల సాగుచేస్తూ ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు.
గూజిరితండా, బద్రియతండా, టోప్యితండా, గన్యా తం డాలతోపాటు మరికొన్ని గ్రామాల్లోని రైతులు ఆకుకూరలను అధికంగా సాగు చేస్తున్నారు. పురుగుమందుల వాడడం వల్ల నష్టాలు తప్పవన్న వాస్తవాన్ని గమనించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ సేంద్రియ విధానాన్ని ఎంచుకున్నా రు. మండలంలోని రైతులు ఎక్కువగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు కూడా ఆకుకూరల సాగు చేస్తున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీన, చుక్కకూర, బచ్చలికూరను ఎక్కువగా పండిస్తున్నా రు. ఆకుకూరల పంటలన్నీ తక్కువ నీటితో పండించవచ్చు. వీటికి సీజన్ అక్కరలేదు. నీటి వసతి ఉంటే చాలు.. గుంట భూమిలో సైతం నిరంతరం ఆదాయం పొందవచ్చు. రోజుల వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. ప్రతిరోజూ ఆకుకూరలను తెంపి స్థానిక మార్కెట్లో లేదా నేరుగా ప్రజలకు విక్రయించ వచ్చు. ఆకుకూరల సాగుతో కుటుంబసభ్యులకు రోజు చేతి నిండా పని ఉంటుంది. ఎకరా పొలంలో ఆకుకూరలు సాగు చేస్తే రూ.10వేల నుంచి రూ.15 వేల ఖర్చు.. పంట చేతికి వస్తే రూ.30వేల నుంచి 50 వేలు మిగులుతుంది. 15 రోజుల వ్యవధిలో పంట చేతికొస్తుంది. కూలీల అవసరం లేకున్నా కుటుంబ సభ్యులతో కలిసి రోజూ మార్కెట్కు తరలిస్తారు.
ప్రతిరోజూ ఆదాయం వస్తుంది
నాలుగు గుంటల స్థలంలో ఆకుకూరలను పండిస్తున్నాం. పదేళ్లుగా ఆకుకూరలు సాగు చేస్తున్నాం. ప్రతిరోజూ ఉద యం నేను, నా భార్య కలిసి ఆకుకూర లు కోసి కట్టలు కడతాం. వాటిని నేను జోగిపేటకు తీసుకెళ్లి కూరగాయల మార్కెట్, రైతుబజార్లలో అమ్ముతా. రో జుకు రూ.1000 నుంచి రూ.1500 ఆదాయం వస్తుంది. ఆకుకూరల సాగుతో రోజు ఆదాయం వస్తుంది.
– సూర్యానాయక్, బద్రియ తండా (రైతు)