గుమ్మడిదల/ పటాన్చెరు టౌన్/ మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 12: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, సీపీఐ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయా పార్టీల ఆధ్వర్యంలో ఫ్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో, పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గు మ్మడిదల కార్యక్రమం లో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రా జయ్య, నాయకులు నర్సింహగౌడ్, వీరేశ్, శ్రీనివాస్, బి.రవి, బి. గోపాల్, అశోక్, మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు గూడెం విక్రమ్‌రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు మెరాజ్‌ఖాన్, యువజన విభాగం అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాలిక్, నాయకులు దినాకర్, పాపయ్య, శివశంకర్, ఇసాక్ అహ్మద్, శంకరయ్య పాల్గొన్నారు. అలాగే, పోస్టాఫీస్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంతోష్, విద్యార్థి నాయకులు అజయ్‌కుమార్, శివ, విష్ణు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.