మెదక్, (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్, నవంబర్ 10: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో కలిసి గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సాపూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డ్‌లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని వెంకటేశ్వర రైస్‌మిల్ ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని వేగంగా అన్లోడ్ చేసుకోవాలని, 50 మందికి తగ్గకుండా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి మిల్లు రోజూ 40 ట్రాక్టర్లు, 10 లారీల నుంచి ధాన్యం అన్ లోడ్ చేసుకునేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ధాన్యం సేకరణకు జిల్లాలో 410 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అన్నారు. ధాన్యం సేకరణ అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ 20 రోజుల్లో ధాన్యం సేకరణ ముగించేలా పకా ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. గన్నీ సంచులు, లారీల ప్రగతిని రోజు వారి సమీక్షిస్తూ ఎకడా కొరత లేకుండా చూడాలని, ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, తాడిపత్రీలు, డిజిటల్ తూకాలతో పాటు తాగు నీరు, సుతిలీ, షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యాన్ని గద్వాల, వనపర్తి జిల్లాలకు తరలిస్తున్నామన్నారు. రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ ఎఫ్ఏ క్యూ ప్రమాణాలకనుగుణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపాలని, స్థలాభావం వల్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటికి పంపాలని కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఎస్వో శ్రీనివాస్, జిల్లా మేనేజర్ గోపాల్, డీసీవో కరుణ, అడిషనల్ డీఆర్డీవో భీమయ్య, మండల ప్రత్యేకాధికారులు, వీఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
ఇప్పటి వరకు జిల్లాలో 374 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5055 మంది రైతుల నుంచి సుమారు 53 కోట్ల విలువ గల 25,630 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 21వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని అన్నారు. నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లోడింగ్ వెంటవెంటనే జరిగేలా వీఆర్ఏలు పర్యవేక్షించాలని అన్నారు. ట్రక్ షీట్ వచ్చిన వెంటనే వేగవంతంగా ట్యాబ్ ఎంట్రీలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, డీటీ సాధిక్ తదితరులు పాల్గొన్నారు.