పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లపై అధికారుల దృష్టి
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 93.79 శాతం పూర్తి
టార్గెట్ రూ.9కోట్ల 76 లక్షలు.. ఇప్పటి వరకు రూ.8 కోట్ల 51లక్షల 28వేలు వసూలు
మార్చి 31వరకు వందశాతం టార్గెట్ పూర్తి చేసేలా చర్యలు
క్షేత్ర స్థాయిలో వసూళ్లను ముమ్మరం చేసిన సిబ్బంది
మెదక్, ఫిబ్రవరి 27:రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా.. పల్లెల్లో ఇలాంటి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు ఆర్థిక వనరులు ఎంతో ముఖ్యం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ స్థానికంగా వసూలయ్యే పన్నులతో పల్లె ప్రగతి సాధ్యమవుతుంది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్ జిల్లాలో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో రూ.9కోట్ల 76 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.8 కోట్ల 51లక్షల 28వేలు వసూలయ్యాయి. మార్చి 31 వరకు గడువు ఉండగా, వంద శాతం పన్నులు రాబట్టి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో వంద శాతం పన్ను వసూలు పూర్తి అయింది.
గ్రామాల అభివృద్ధికి పన్నులే ప్రధాన వనరు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులతో పాటు ఇంటి పన్నులు కీలకంగా మారాయి. పల్లెలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం కూడా అవసరం. దీని కోసం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు
జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో పాటు పన్నుల రూపంలో వచ్చిన నిధులు కూడా వినియోగించుకుంటూ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు కేటాయిస్తున్నది. మురుగు కాల్వల శుభ్రం, తాగునీటి వసతి, మొక్కల పెంపకం, ప్రతి పంచాయతీకి నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠధామం వంటి పనులు చేపడుతున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ట్రాక్టర్ కొని, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు.
93.79 శాతం వసూలు
జిల్లాలోని 469 పంచాయతీల్లో రూ.9.76 కోట్లగాను ఇప్పటి వరకు రూ.8 కోట్ల 51 లక్షల 28వేలు (93.79 శాతం) వసూలు చేశారు. ఇంకా రూ.56.39 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరుకు మొత్తం వసూలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో పన్ను వసూలులో చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం మండలాలు వంద శాతం పూర్తి చేశాయి.
వందశాతం పూర్తి చేస్తాం
మార్చి నెలాఖరు నాటికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. మెదక్ జిల్లాలో 469 గ్రామాల్లో ఇప్పటికే 93.79 శాతం పన్నులు వసూలు చేశారు. జిల్లాలో రూ.9.76 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.8.51 కోట్లు వసూలుచేశాం. వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను ముందంజలో ఉంచుతాం.
– సీహెచ్.తరుణ్‌కుమార్, డీపీవో, మెదక్