జహీరాబాద్, అక్టోబర్ 31: ప్రకృతిలో పెరుగుతున్న ఆకు కూరలు ఎన్నో తెలుసా.. మహా అయితే పాలకూర, తోటకూర, మెంతికూరలు తెలుసు. మార్కెట్లో సైతం వాటిదే రాజ్యం అయ్యింది. మన పల్లెల్లో ప్రకృతి సిద్ధంగా పొలం గట్లపై, కాలువలు, వాగుల పక్కన, చెరువు కాల్వల పక్కన రకరకాల ఆకు కూరలు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. వీటిలో అధిక పోషకాలు ఉన్నాయని పోషక నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఊరి ఆకు కూరలకు మళ్లీ మంచి కాలం వస్తున్నది. అంతరించిపోతున్న ఆకు కూరలకు మళ్లీ డిమాండ్ పెరుగుతున్నది. ప్రకృతి పంటలతో పాటు పెరుగుతున్న ఆకుకూరలు ‘ముల్లు దొగ్గలి, గునుగు, తుమ్మికూర, ఎలుక చెవుల కూర, సన్నపాయల కూర, ఎర్రపుండి, బుడ్డ కాశ, జొన్న చెంచలి, ఆడవి పుల్లకూర’ ఇలా అనేక ఆకు కూరలు ఉన్నాయి. ఇటీవల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ‘సాగు చేయని ఆకు కూరల ఉత్సవం’ నిర్వహించి వాటి పోషకాల విలువలు తెలిపింది.
పచ్చకూరలు ఆరోగ్యాన్ని నిలబెడుతాయి.. పంటపొలాల్లో మనం చూసి వదిలేసే ఆకుకూరలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు, ఉపయోగాలు తెలియక పోవడంతో కలుపు మొక్కలుగా చూస్తున్నాం. కానీ, నిత్యం పొలంగట్లపై, చెరువు పక్కన ఇలా పలు ప్రాంతాల్లో మొక్కలు ఎన్నో ఉంటాయి వాటిని గురించి తెలుసుకుని నిత్యం వంటకాల్లో వండుకుని తింటే వాటి నుంచి వచ్చే ఫలితాలు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
ఎర్రపుంటి కూర ఎక్కువగా పంట పొలంలో పెరుగుతుంది. సాగు చేయకముందు ఆడవులు, పొలాల్లో ఉండేది. ఎర్ర, నల్ల భూముల్లో ఎక్కువగా పెరుతుంది. ఆకులు పచ్చగా ఉండి, కాండ ఎర్రగా ఉంటుంది. వానకాలంలో ఏపుగా పెరుగుతుంది. దీనిని గోంగూర అని కూడా అంటారు. చలికాలంలో మంచుకు పెరిగే ఈ ఆకుకూర రుచిగా ఉంటుంది. పప్పుతో పాటు చట్నీలు కూడా చేసుకుంటారు. పులుపుతో పాటు పోషక విలువలు అధికం.
గంగవాయిలి కూర ఎక్కువగా ఇసుక భూమిలో నేలను పాకుతూ పెరుగుతుంది. ఆకు కూరను కొన్నిప్రాంతంలో పాయల కూర, పప్పు కూర అని కూడా అంటారు. ఏ ఆకు కూరల్లో లేని అధిక పోషకాలు ఇందులో ఉంటాయి. చెడుకొవ్వును తొలిగించే గుణం ఈ కూరకు ఉంది. ఈ ఆకులను తెంపి పప్పుతో వండుకుంటున్నారు.
తుమ్మి ఆకులు, పూలలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వినాయక చవితి పూజల్లో తుమ్మి కూర పెడుతారు. వ్యవసాయ భూముల్లో తుమ్మి కూర ఎక్కడ పడితే అక్కడ గుంపులు, గుంపులుగా కనిపిస్తుంది. లేతగా ఉన్నప్పుడు ఆకుల్ని తెంపుకొని, కంది పప్పు, చింతపండు, పచ్చ చింతకాయతో కలిపి వండుతారు.
ముల్లు దొగ్గలి కూర ఆకులు పొడవు, వెడల్పుగా ఉంటాయి. విత్తనాలు కాస్తాయి. చిన్న కంకిలాంటి పూలు పూయడం
వల్ల కోడిజుట్టు కూర అని కూడా పిలుస్తారు. మొక్క ముదిరితే కాండానికి ముల్లు పెరుగుతున్నది. దీనిని ముల్లు దొగ్గలి అని కూడా అంటారు. లేతగా ఉన్నపుడు కాడలతో సహా తెంపుకొని పప్పులో వేసి వంట చేస్తారు. ఇందులో అధిక సూక్ష్మ పోషకాలు ఉండి శరీరంలో రక్త ప్రసరణ సులువుగా సాగేందుకు అవకాశం ఉంది. చర్మంపై ఉన్న గాయాలను నయం చేసేందుకు
ముల్లు దొగ్గలి ఉపయోగపడుతుంది.
ఆకు కూరలంటే పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలి, గోంగూర కాదు. వీటిని రైతులు వ్యవసాయంలో ప్రత్యేకంగా సాగు చేసి మార్కెట్లో అమ్మకాలు చేస్తారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయ పంటలతో పాటు 15-20 ఆకు కూరలు పెరుగుతాయి. పొలంలో సాగు చేయకపోయినా ప్రకృతిలో వాటంతట అవే పెరిగే ఆకుకూరలున్నాయి. ఇవన్నీ ఊరిలో ఇండ్ల చుట్టు పక్కన, పొలాలు, వాగులు, కాల్వలు, చెరువుగట్లపై పెరుగుతాయి. పంటపొలాల్లో అయితే కలుపు మొక్కల్లా పీకి పారేస్తుంటారు. పొలంలో ఉన్న ఆకుకూరలు చాలా వరకు తినే ఆకు కూరలే. సూక్ష్మపోషకాలతో వాణిజ్య రకాలైన పాలకూర, తోటకూరలో ఉన్న పోషకాలు ఇందులో ఉంటాయాని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక పోషకాలు, నాలుకకు రుచిగా ఉండే ఆకు కూరలనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఊరి ఆకు కూరలు పూర్వకాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఆకు కూరలు కనుమరుగవుతున్న తరుణంలో గుర్తింపు తీసుకువచ్చేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. పోషకాలు ఉన్న ఆకు కూరలు ప్రకృతిలో పెరుగుతున్నా తినేవాళ్లు తగ్గిపోయారు. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఆకుకూరలు రైతులు పడించి విక్రయిస్తున్నారు. పల్లెల్లో సాగు చేస్తున్న పంటలో ఆకు కూరలను రూపాయి ఖర్చు లేకుండా తినవచ్చు. సంగారెడ్డి, జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లో ఉన్న డీడీఎస్ ఈ ఆకు కూరలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది.
జొన్న చెంచలి కూర మెట్టపొలాల్లో వానకాలంలో పెరుగుతుంది. తోటకూరను పోలి ఉంటుంది. పప్పుతో ఎక్కువగా చేసుకుంటారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది.
ప్రకృతిలో పెరిగే ఆకు కూరల్లో అధిక పోషకాలు ఉంటాయి. రసాయన మందులు వేసి సాగు చేసిన, ఆకు కూరలతో వంటలు చేసుకోవడంతో నష్టం. ఎలాంటి రసాయన మందులు లేకుండా భూమిలో పెరుగుతున్న ఆకుల్లో ఉన్న పోషకాలు అధికం. మహిళా సంఘాలు మొలకలు అనే ఆకుల్లో ఉన్న పోషక విలువలు గుర్తించి వాటిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. పంట పొలంలో ఆకుకూరలు వాటంతట అవ్వే పెరుగుతాయి.
– పి.వి. సతీశ్, డీడీఎస్ డైరెక్టర్