– డీఆర్డీవో శ్రీనివాస్‌రావు
సంగారెడ్డి, అక్టోబర్ 29: సమాజంలో మహిళా సంఘాలదే కీలక పాత్ర అని డీఆర్డీవో శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పాత డీఆర్డీవో కార్యాలయంలోని జిల్లా సమా క్య సమావేశ మందిరంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షురాలిగా జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా విక్టోరియా, ఉపాధ్యాక్షురాలిగా శిరీష, సహ కార్యదర్శిగా తుక్కమ్మ, కోశాధికారిగా పద్మకుమారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన జిల్లా సమాక్య బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ప్రభుత్వం అందించే రుణాలతో సొంతకాళ్లపై నిలబడే శక్తిని సాధించడం గొప్పవిషయమన్నారు.
జిల్లాలో 18 వేల మహిళా సంఘాల్లో 1.98 లక్షల మంది సభ్యలుగా నమోదు చేసుకుని, ఆర్థికంగా రాణిస్తున్నారన్నారు. మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో ఆర్థికంగా ఎదిగి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల బ్యాంక్ రుణాలు తీసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారన్నారు. జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఈ బృందం కీలకంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు డీఆర్డీవో సూర్యారావు, మండల సమాక్య ప్రతినిధులు, డీపీఎంలు, శ్యామల, జయశ్రీ, మల్లేశం, ఏపీఎంలు సాయిలు, నరేందర్, రాజశేఖర్, వెంకట్, సీబీవో ఆడిటర్లు, జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.