చేగుంట, అక్టోబర్ 28: అస్వస్థతకు గురై, దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న వడియారం పోచవ్వ, మత్తడి కృష్ణను శుక్రవారం సాయంత్రం ఎంపీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పోచవ్వ వైద్యం కోసం ఎంపీ రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. పెద్దశివునూర్ గ్రామంలో చికిత్స పొందుతున్న వారితో పాటు పలు చోట్ల ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గ్రామంలో చికిత్స పొందుతున్న వారికి స్థానిక వైద్య సిబ్బందితో పాటు స్థానిక సర్పంచ్ ముదాం రుక్మిణీబాయి, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర ఏర్పాట్లకు వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మెదక్ ఎంపీ వెంట డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, సుభాశ్‌రెడ్డి తదితరులున్నారు.