తెలుగు భాషకు తలకట్టు ఎంత ముఖ్యమో.. తలకు తలపాగా అంతే. తలపై టోపీ పెట్టినంత సులువుకాదు తలపాగా చుట్టడం. తలపాగా చుట్టడం రాక తలవంకరగా ఉందనే వారట ఎనకటికి. తెలుగు సంస్కృతిలో పంచకట్టు ఎంతముఖ్యమో.. తలపాగా చుట్టడం అంతేముఖ్యం.. తలపాగా చుట్టడం ఒక కళ.. కుల మతాలకతీతంగా సబ్బండ వర్గాలకు ఇదొక గొప్ప వస్త్రం. అలాంటిది కాలక్రమంలో కనుమరుగవుతున్నది. దేశంలోని కొన్నిచోట్ల తలపాగా అని, మరికొన్ని చోట్ల పగిడిగా, టర్బన్లుగా వివిధ పేర్లతో దీనిని పిలుస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో మాత్రం ఈ తలపాగా ‘రుమాల్’గా ఎంతో ప్రాచూర్యం పొందింది. దేశంలోని కొన్ని కుటుంబాలు సంప్రదాయబద్ధంగా వీటిని ధరిస్తుంటారు.
– మద్దూరు (ధూళిమిట్ట), అక్టోబర్ 22
మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 22: తలపాగా మన పూర్వీకులకు అదొక కీర్తికిరీటం, శిరస్సును కాపాడే శిరస్ర్తాణం. సంస్కృతీ సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం. కుల మతాలకతీతంగా సబ్బండ వర్గాలకు ఇదొక గొప్ప వస్త్రం. అలాంటి వస్త్రం, ఆచారం కాలక్రమంలో కనుమరుగవుతున్నది. దేశంలో కొన్ని చోట్ల తలపాగా అని, మరికొన్ని చోట్ల పగిడిగా, టర్బన్లుగా వివిధ పేర్లతో దీనిని పిలుస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో మాత్రం ఈ తలపాగా ‘రుమాల్’గా ఎంతో ప్రసిద్ధి పొందింది. తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా నెత్తికి రుమాల్ చుట్టుకొని అక్కడక్కడ మన పెద్దలు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటారు. ‘చుట్టర..చుట్టూ తలపాగా చుట్టరా.. పట్టరపట్టు పిడికిలి బిగపట్టరా’ అంటూ ఇటీవల ఓసినీ కవి తలపాగా గురించి ఎలుగెత్తి చాటగా.. నెత్తికి రుమాల్, జబ్బకు గొంగడి.. జాతరకు పోదామా..! అంటూ జానపదులు రుమాల్ గొప్పతనంపై పాటలు కైకట్టి ఆడిపాడారు. పల్లెటూర్లలో ఏ తాతను పలకరించినా రుమాల్ గొప్పతనం గురించి కథలు కథలుగా చెబుతుంటారు.
తలపాగా ఆచారం
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో ‘తలపాగా’ను ఏదో ఒక రూపంలో ధరించడం చూస్తుంటాం. ప్రతికూల వాతావరణం నుంచి తమను తాము కాపాడుకోవడానికి తలపాగాను మానవుడు రానురాను తన జీవన విధానానికి, హోదాకి చిహ్నంగా రూపొందించుకున్నాడు. పూర్వం మహారాజులు మణుల కొద్దీ బరువైన కిరీటాలను పట్టాభిషేక మహోత్సవాల లాంటి ప్రత్యేక సందర్భాల్లో ధరించేవారు. సాధారణ రోజుల్లో వారి దర్పాన్ని ఇనుమడింపజేసే నగిషీలతో తక్కువ బరువు కలిగిన వివిధ రకాల తలపాగాలను ధరించేవారు. తలపాగా అనేది తలని పలు చుట్లతో కప్పే ఒక వస్త్రం. దీనిని ధరించే విధానాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. తలపాగా అనేది రోజువారి పనుల్లోనే కాకుండా శుభకార్యాలు, ఉత్సవాల్లో తప్పకుండా ధరిస్తారు. వ్యక్తి ఆహార్యం ఉట్టిపడేలా చేస్తుంది. ‘తెలుగు భాషకు తలకట్టు ఎంత ముఖ్యమో.. తెలుగువాడి తలకు తలపాగా అంతే ముఖ్యం’ అన్నంతగా మన తెలుగు సంస్కృతిలో తలపాగాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పంచెకట్టు ఎంత కష్టమో.. తలపాగా చుట్టడం కూడా అంతే కష్టం. తలపాగా చుట్టడం అనేది ఒక కళ. అది టోపీ
పెట్టినంత సులువుకాదు.
నెత్తికి రక్షణ కవచంగా రుమాల్…
ప్రస్తుతం ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో పెట్టుకునే హెల్మెట్ మాదిరిగా పూర్వం తాతల కాలంలో నెత్తికి రుమాలు చుట్టుకునేది.
గొల్లకురుమలు జీవాలకు కొమ్మకొట్టే సమయంలో చెట్టు కొమ్మలు తలపైన పడకుండా ఉండేందుకు రుమాల్ ఎంతో ఉపయోగపడేది. బలమైన వస్తువులు తలపైన పడితే తలకు గాయం కాకుండా, అలాగే ఎండ, వాన, చలి నుంచి తలను కాపాడుకునేందుకు ఈ రుమాల్ ఎంతగానో ఉపయోగపడేది. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న రుమాల్ కాలక్రమంలో కనుమరుగవుతున్నది.
రుమాల్ చుట్టుకోవడానికి నేటితరం యువత నామూసీగా ఫీలవుతున్నారు.
ఇక తాతలతో పాటే రుమాలు కనుమరుగై ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుండడం ఎంతో దూరంలో లేదు.
యాభై ఏండ్ల నుంచి రుమాల్ సుడుతున్న..
ఎండ, వానకు తడవకుండా, తలకాయ నొయ్యకుండా ఉండేందుకు, నీడ కోసం మేము రుమాలు సుడుతం. నేనైతే యాభై ఏండ్ల నుంచి రుమాల్ సుడుతున్న. మా దేవస్థానాలకొచ్చినోళ్లకు, పూజలు చేసేటప్పుడు తప్పకుండా ఈ రుమాలు ఉండాల్సిందే. రుమాలు సుట్టకపోతే ఏదో మరిచిపోయినట్లు అనిపిస్తది. రుమాలు సుట్టపోతే మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు.
-ఇస్తారి, పిట్టలగూడెం (సిద్దిపేట జిల్లా)
రుమాలే మనిషికి అందం
రుమాలే మనిషికి అందం. నెత్తికి రుమాలు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటది. ఐదేండ్ల నుంచి నేను రుమాలు సుడుతున్న. ఊళ్లే చిన్న పిల్లలైతే రుమాల్ తాత వస్తుండు అంటరు. రుమాల్ అనేది జీవన విధానంలో భాగమైంది. రుమాల్ లేకుండా బయటకు పోను. ఇప్పటి పిల్లలు రుమాల్ సుట్టుకుంటలేరు. టోపీలు పెడుతుండ్రు
-గొర్ల కొమురయ్య, బైరాన్పల్లి (సిద్దిపేట జిల్లా)
రుమాల్ లేనిది బయటకు వెళ్లను..
నెత్తికి రుమాల్ లేకుండా ఇంటినుంచి అడుగు బయట పెట్టను. నేను బుద్ధి నేర్వక ముందు నుంచే మా అయ్య, అవ్వ నానెత్తికి రుమాల్ చుట్టిండ్రు. జీవాల వెంబడి పోయినప్పుడు గొడ్డలితో కొమ్మ కొడితే ఒక్కసారి నెత్తిమీద పడొచ్చు, లేకపోతే గొడ్డలే వచ్చి నెత్తిమీద పడొచ్చు. అందుకనే మాగొల్ల కురుమలు తప్పకుండా రుమాలు సుట్టుకుంటరు.
-చెట్కూరి ఐలయ్య, సలాఖపూర్ (సిద్దిపేట జిల్లా)
గౌరవానికి చిహ్నం..
ప్రస్తుత రోజుల్లో తలపాగా(రుమాల్)ను గౌరవానికి చిహ్నంగా ధరింపజేస్తున్నారు. శుభకార్యాలతో పాటు వివిధ సమావేశాల్లో రాజకీయ నాయకులకు వారి అనుచరులు తలపాగాను ధరింపచేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులు తలపాగాలను ధరించి మురిసిపోతున్నారు. వివిధ రంగుల్లో ఉండే తలపాగాలను ఆయా సందర్భాలను బట్టి ధరిస్తున్నారు. ఈ తలపాగా పొడువు సుమారు 5 మీటర్లకు పైగా ఉంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన తలపాగాను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.