హుస్నాబాద్, అక్టోబర్ 21: మట్టితో తయారుచేసిన దీపంతెల(దివ్వెలు)కు మంచి గిరాకీ ఏర్పడింది. దీపాల పండుగ వేళ్ల మట్టి దీపంతెల్లోనే దీపాలు పెట్టేందుకు జనం ఆసక్తి కనబరుస్తుంటారు. మట్టి దీపంతెలు అందుబాటులో లేని సమయంలో స్టీలు, ఇనుము, ప్లాస్టిక్‌తో చేసిన దీపంతెలను వాడేవారు. కానీ, ఇటీవల మట్టి దీపంతెలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ వీటిలోనే దీపాలు వెలిగిస్తున్నారు. అంతేకాకుండా మట్టి దీపంతెలతో దీపారాధన చేస్తే మంగళకరం అని విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆకారాల్లో దీపంతెలు లభిస్తున్నాయి. సుమారు 15రకాల ఆకారాల్లో దీపంతెలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ఆకారాల్లో తయారు చేయడంతో పాటు మరింత ఆకట్టుకునేలా రంగులు వేసి మరీ విక్రయిస్తున్నారు.
కుమ్మరులు తయారు చేసిన దీపంతెలతో పాటు యంత్రాలతో తయారుచేసిన దీపంతెలు మార్కెట్లో లభిస్తున్నాయి. దీపావళి వచ్చిందంటే దీపంతెలకు మంచి గిరాకీ ఉంటుందని, తమకు కూడా ఉపాధి లభిస్తుందని కుమ్మర వృత్తిదారులు చెబుతున్నారు. ఒక్కో దీపంతె రెండు రూపాయల నుంచి మొదలుకొని 50రూపాయల వరకు దొరుకుతున్నాయి. దీపావళి పండుగకు మట్టి దీపాల్లోనే దీపాలు పెడితే మంచిదనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీంతో వ్యాపారులు సైతం ఆకట్టుకునే విధంగా ఉన్న మట్టి దీపంతెలను తెచ్చి అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్డుతో పాటు పలుచోట్ల మట్టి దీపంతెలు విక్రయిస్తున్నారు. కుమ్మర వృత్తిదారులతో పాటు వ్యాపారులు మట్టి దీపంతెలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
మంచి గిరాకీ ఉంటుంది
నేను ఏటా దీపావళికి మట్టి దీపంతెలు అమ్ముతుంటా. స్వయంగా మా ఆయన చేసిన దీపంతెలతో పాటు ఇతర ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల దీపంతెలను తెచ్చి విక్రయిస్తున్నా. దీపావళి పండుగకు మట్టి దీపంతెలకు మంచి గిరాకీ ఉంటుంది. ఐదు రూపాయల నుంచి మొదలుకొని యాభై రూపాయల వరకు దీపంతెలు మా వద్ద ఉన్నాయి. కొన్ని దీపంతెలకు రంగులు వేసి ఆకట్టుకునేలా తయారుచేస్తున్నం. ఒక్కొక్కరు 10నుంచి 50వరకు చిన్న దీపంతెలు కొనుక్కొని పోతున్నారు. నోములు ఉన్నవారు పెద్దవాటిని కొంటారు. మట్టి దీపంతెల వ్యాపారంతో ఉపాధి పొందుతున్నాం.
-శనిగరపు సబిత, హుస్నాబాద్