సంగారెడ్డి జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1504 అంగన్వాడీ, 160 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 400 జనాభా దాటిన గ్రామాల్లోని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ఐదు ప్రాజెక్టు పరిధిలో 400 జనాభా దాటిన మినీ అంగన్వాడీ కేంద్రాలు 40 ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా త్వరలో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో 40 మంది ఆయాలను నియమిస్తారు. దీంతో మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్ల పనిభారం తగ్గుతుంది. అంతేకాకుండా మాతాశిశుకు మెరుగైన సేవలు, పౌష్టికాహారం లభించనున్నాయి.
మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన అంగన్వాడీల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ మేరకు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కొన్నింటిని ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. జనాభా, లబ్ధిదారుల ప్రాతిపాదికన అంగన్వాడీ కేంద్రాల మార్పు చేపట్టేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించింది. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేసేందుకు వెయ్యికంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక టీచర్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయా మినీ కేంద్రాలను పెరిగిన జనాభా ఆధారంగా ప్రధాన కేంద్రాలుగా మార్చనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1504 అంగన్వాడీ, 160 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 400 జనాభా దాటిన గ్రామాల్లోని 40 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వం వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక ఆయాను నియమించి బాలబాలికలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నది. వెయ్యి కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక టీచర్‌ను నియమించింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1504 అంగన్వాడీ, 160 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం 400 జనాభా దాటిన గ్రామాల్లోని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు కుటుంబ సర్వే ఆధారంగా మినీ అంగన్వాడీల్లోని జనాభా వివరాలు అందజేయాలని ప్రభుత్వం స్త్రీ,శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని జనాభా వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. 400 జనాభా దాటిన 40 మినీ అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో 160 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో 12, అందోలు ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది, నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో 122, రామచంద్రాపురం ప్రాజెక్టు పరిధిలో ఒకటి, జహీరాబాద్ ప్రాజెక్టు పరిధిలో 17 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అధికారుల సర్వే ఆధారంగా 400 జనాభా దాటిన 40 మినీ అంగన్వాడీ కేంద్రాలను అధికారుల గుర్తించారు. రామచంద్రాపురం ప్రాజెక్టు పరిధిలో ఒకటి, జహీరాబాద్ ప్రాజెక్టు పరిధిలో ఐదు, నారాయణఖేడ్ ప్రాజెక్టులో 21, అందోలు ప్రాజెక్టులో మూడు, సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో 10 మినీ అంగన్వాడీ కేంద్రాలను గుర్తించారు. దీంతో ఆయా కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా త్వరలో అప్‌గ్రేడ్ కానున్నాయి. ప్రధాన కేంద్రాలుగా మార్పు చేయడం వల్ల ఆయా కేంద్రాల్లో ఒక్కో ఆయా చొప్పున 40 మంది ఆయాలను నియమించనున్నారు. అలాగే మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్ల వేతనాలు పెరుగనున్నాయి. పిల్లలు, గర్భిణులకు సేవలు అందించటంలో ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్లపై పనిభారం తగ్గనున్నది.
మినీ అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో చిన్నారులు, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. బాలింతలు పేరు నమోదు చేసుకున్న తర్వాత ప్రతినెల పౌష్టికాహారం అందజేస్తున్నారు. గర్భిణులకు ప్రతిరోజు అన్నం, ఆకుకూర, కూరగాయలు, పప్పు, గుడ్డు ఇతర పోషకవిలువలున్న ధాన్యాలతో సంపూర్ణ భోజనం అందజేస్తారు. 200 మిల్లీలీటర్ల పాలను ఇస్తారు. ఆరుమాసాల వరకు ప్రతిరోజు ఒక పూట భోజనం, పాలు ఇస్తారు. చిన్నారులకు బాలామృతం, 16 గుడ్లు ఇస్తారు. 3 నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పౌష్టిక విలువలున్న భోజనం, గుడ్డు ఇస్తారు. అంగన్వాడీ టీచర్ పిల్లలకు ప్రీ స్కూల్ పాఠ్యంశాల బోధన ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కోరింది. సంగారెడ్డి జిల్లాలో 160 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కుటుంబ సర్వే ఆధారంగా తాజా జనాభా వివరాలను ఉన్నతాధికారులకు అందజేశాం. 400 జనాభా పైన ఉన్న 40 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
– పద్మావతి, డీడీ,మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ