రైస్‌మిల్లర్ల నుంచి పోషక బియ్యం (ఫొర్టిఫైడ్ రైస్) మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేయడంతో పాటు ఫొర్టిఫైడ్ రైస్‌గా మార్చిన తర్వాతే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), సివిల్ సైప్లె కార్పొరేషన్ (సీఎస్సీ)లకు పంపాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 61 రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో రా రైస్ మిల్లులు 43, పారా బాయిల్డ్ రైస్‌మిల్లులు 18 ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి ఫొర్టిఫైడ్ రైస్ తయారు చేసేందుకు 61 మంది మిల్లర్లు తమ మిల్లుల్లో బ్లెండింగ్ యంత్రాలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి జిల్లాలో 2.30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 158 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం సేకరణ, ఫొర్టిఫైడ్ బియ్యం తయారీ, సరఫరాపై ఈ నెల 21న కలెక్టర్ శరత్ సమావేశం నిర్వహించనున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుంచి పోషకాలు ఉన్న బియ్యం (ఫొర్టిఫైడ్ రైస్) తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. వానకాలం ధాన్యం సేకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, సీఎంఆర్‌పై తాజా మార్గదర్శకాలను విడుదల చేసిం ది. ఇందులో భాగంగానే ధాన్యం సేకరణకు సంబంధించి గ్రేడ్ -ఏ రకం క్వింటాల్‌కు రూ.2,060, కామన్ రకం రూ.2,040 ధరలను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభంకానుండగా, జిల్లా యంత్రాంగం కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ధాన్యం సేకరణ ఏర్పాట్లు చేస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి 2.30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 70, పీఏసీఎస్ ఆధ్వర్యం లో 74, డీసీఎంస్ఎస్ ఆధ్వర్యంలో 14 మొత్తం 158 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సేకరించిన ధాన్యా న్ని మిల్లులకు చేర్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయటంతోపాటు ఫొర్టిఫైడ్ రైస్‌గా మార్చిన తర్వాతే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), సివిల్ సైప్లె కార్పొరేషన్ (సీఎస్సీ)లకు పంపాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గతేడాది వరకు కేంద్ర ప్రభుత్వం మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ముడిబియ్యం లేదా పారాబాయిల్డ్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్ సైప్లె కార్పొరేషన్‌కు అందజేసేది. మిల్లర్లు తమకు కేటాయించిన కోటాను అనుసరించి సీఎంఆర్ ఎఫ్సీఐకు 59 శాతం, సివిల్ సైప్లె కార్పొరేషన్‌కు 41శాతం బియ్యాన్ని అందజేసేది. తాజా మార్గదర్శకాలను అనుసరించి మిల్లర్లు ఇప్పుడు కచ్చితంగా పోషకబియ్యం (ఫొర్టిఫైడ్ రైస్)ను మాత్రమే సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉంటుంది.
జిల్లాలోని మిల్లర్లు ప్రస్తుతం తమ రైస్ మిల్లుల్లో ఫొర్టిఫైడ్ రైస్ బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమున్నది. అదనంగా బ్లెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటేనే మిల్లర్లు కోటామేరకు ఫొర్టిఫైడ్ రైస్‌ను తయారు చేసి ఎఫ్‌సీఐ, సీఎస్సీకి సరఫరా చేయగలుగుతారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 61 రైస్ మిల్లులున్నాయి. ఇందులో రా రైస్ మిల్లులు 43 ఉండగా, పారా బాయిల్డ్ రైస్ మిల్లులు 18 ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ కూడా ఫొర్టిఫైడ్ రైస్ తయారు చేయటం లేదు. కేంద్రం తాజాగా మార్గదర్శకాలతో ఫొర్టిఫైడ్ రైస్ తయారు చేయాల్సిందే. ఇందుకు 61 మిల్లుల్లో బ్లెండింగ్ యంత్రాలను బిగించుకోవాల్సిన వస్తుంది. దీంతో ఏర్పాటు దిశగా మిల్లర్లు దృష్టిసారించారు. కాగా, ఒక్కో బ్లెండింగ్ యూనిట్‌కు సుమారు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈనెల 21న సంగారెడ్డి కలెక్టర్ శరత్ వానకాలం ధాన్యం సేకరణ, ఫొర్టిఫైడ్ బియ్యం తయారీ, సరఫరాపై మిల్లర్లతో సమావేశం నిర్వహించనున్నారు. పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రతి రైస్‌మిల్లును సందర్శించి ఫొర్టిఫైడ్ రైస్ తయారీకి అవసరమైన బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఇప్పటి వరకు పది మంది మిల్లర్లు బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం చర్యల మూలంగా హాంగర్ ఇండెక్స్‌లో భారతదేశం 107వ స్థానంలో ఉంది. మహిళలు రక్తహీనత కారణంగా అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉన్నది. దీనిని అధిగమించేందుకు ప్రపంచదేశాలు తమ పౌరులకు పౌష్టికాహారం అందజేయటంపై దృష్టిపెట్టాయి. చాలా దేశాలు తమ ప్రజలకు ఫొర్టిఫైడ్ రైస్‌ను అందజేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం పౌరులకు ఫొర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగానే మిల్లర్లు కచ్చితంగా సాధారణ బియ్యాన్ని అలాగే సరఫరా చేయవద్దని ఫొర్టిఫైడ్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, రా రైస్ లేదా పారా బాయిల్డ్ రైస్‌లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి.
ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ నేపథ్యంలో బియానికి సూక్ష్మ పోషకాలను జతచేసి పోషక బియ్యం తయారు చేస్తారు. ఫొర్టిఫైడ్ రైస్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫొర్టిఫైడ్ రైస్ తయారీ మొదట కెర్నల్స్‌ను తయారు చేస్తారు. గోధుమలు, మినుములు, పెసర, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని ఫొర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటారు. ఫొర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్లో ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ బి-12, జింక్, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6 ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వందకిలోల సాధారణ బియ్యానికి కేజీ ఫొర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ కలపటంతో ఫొర్టిఫైడ్ రైస్ తయారు అవుతుంది.