మెదక్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : దీపావళి పండుగ సందర్భంగా తాతాలికంగా పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు తప్పకుండా సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బుధవారం ఓ ప్రకటనలో సూ చించారు. సంబంధిత అధికారి అనుమతి లేకుండా ఎవరైనా పటాకుల దుకాణాలను ఏర్పాటుచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
దుకాణాలను ఖాళీ ప్రదేశాల్లో జనావాసాలకు దూరంగా నెలకొల్పాలని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్వోసీ సర్టిఫికెటు పొందుపర్చాలని సూచించారు. దుకాణానికి-దుకాణానికి మధ్య వ్యత్యాసం 3 మీటర్లు ఉండాలని, రెసిడెన్షియల్, గృహనిర్మాణాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలని తెలిపారు. జనరద్దీ గల ప్రదేశాల్లో ఎలాంటి పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.