ఏటూరునాగారం, అక్టోబర్ 18 : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే క్రీడల కోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నుంచి 1,464 మంది క్రీడాకారులు, 168 మంది ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలతో ప్రత్యక్షంగా మరో 350 మంది అధికారులు, ఉపాధ్యాయులు, వర్కర్లు పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ హాజరై కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పీవో అంకిత్, వరుణ్‌రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి వేదికపై శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శలు ఆకట్టుకున్నాయి.
ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు
ఈ క్రీడల్లో ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో జోన్ నుంచి ఒక్కో క్రీడలో అండర్-14, 17 సంవత్సరాల బాలబాలికలు రెండేసి జట్లు పాల్గొంటున్నాయి. జోన్-1 భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, జోన్-2 ఏటూరునాగారం పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు, జోన్-3 ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి, జోన్-4 ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జోన్-5 పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోన్-6 పరిధిలోని వికారాబాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ క్రీడల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, అర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీల్లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు. క్రీడా మైదానంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.
పట్టుదల ఉంటే విజయం మీదే..
పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో సక్సెస్ అవుతారని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. పోటీలను ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు కెరీర్లో పునాదుల్లా ఉపయోగపడుతాయన్నారు. శారీరక, మానసికంగా దృఢంగా ఉండి క్రమశిక్షణ పాటిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. క్రీడల ద్వారా ఎదురయ్యే అనుభవాలు జీవితంలో మంచి పాఠాలు నేర్పుతాయన్నారు. త్వరలో భద్రాచలంలో నిర్వహించే సొసైటీ మీట్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
మనసు పెట్టి ఆడాలి
క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి అవసరమైన డ్రెస్‌లు, షూలు అందించామని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కమిషనర్ ప్రత్యేక చొరవతో క్రీడల నిర్వహణకు అనుమతి ఇచ్చారని చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని.. మనసు పెట్టి ఆడాలని కోరారు. గతం కంటే క్రీడాకారుల్లో చాలా మార్పు వచ్చిందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ క్రీడలతోపాటు చదువులో కూడా రాణించాలని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి సత్తా చాటాలని సూచించారు. ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీవోలు అంకిత్, వరుణ్‌రెడ్డి, గౌతం పొట్రు, ఏఎస్పీ అశోక్‌కుమార్, డీడీలు పోచం, మంకిడి ఎర్రయ్య, జహీరుద్దీన్, ప్రేమకళ, ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, సర్పంచు ఈసం రామ్మూర్తి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, పీహెచ్‌వో రమణ, ఎస్వో రాజ్‌కుమార్, ఈఈ హేమలత, ఏటీడీవో దేశీరామ్నాయక్, ఏసీఎంవోలు రవీందర్, కె.రవీందర్, హీరులాల్, లింగాల శ్రీరాములు, రమాదేవి, చెంచయ్య, పొదెం కృష్ణ ప్రసాద్, స్కౌట్ మాస్టర్ గోపాల్, క్రీడల నిర్వహణ అధికారులు శ్యామలత, ఆదినారాయణ పాల్గొన్నారు.