హుస్నాబాద్, అక్టోబర్ 18: హుస్నాబాద్ ప్రాంతంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు త్వరలోనే పర్యాటక సొబగులు అద్దనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే పూర్తిగా నిండిమత్తడి దుంకుతున్నది. ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్‌రావుకు విన్నవించగా ఇటీవల ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్లమ్మ చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. గతంలోనూ మిషన్ కాకతీయ కింద కట్ట పనులు జరిగాయి. ఈ పనులకు కొనసాగింపుగా మరిన్ని నిధులు రావడంతో ఇక్కడ సకల వసతులు కల్పించి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ పనులు నిర్వహించే బాధ్యతను పర్యాటకశాఖకు అప్పగించడం విశేషం. పర్యాటక శాఖ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఎల్లమ్మ చెరువును సందర్శించి సర్వే చేశారు. కట్ట పైభాగం, కిందిభాగంలో ఏయే పనులు నిర్వహించాలి, ఎలా చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా మారుతుందో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చర్చలు జరిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు.
ఎల్లమ్మ చెరువు వద్ద కల్పించబోయే సౌకర్యాలు
హుస్నాబాద్ పట్టణ శివారును ఆనుకొని ఉండే ఎల్లమ్మ చెరువు నిండిందంటే పట్టణం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తారు. చెరువు కట్ట ఎక్కి చూస్తే ఆహ్లాదం కలుగుతుంది. ఇక కట్టపైన, కింది భాగంలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించినట్లయితే పర్యాటకుల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. చెరువు కట్ట పొడవు 1.5కిలోమీటర్లు ఉంటుంది. కట్టపై భాగంలో సీసీ రోడ్డు వేయడం, ఇరువైపులా లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, ఉదయం సాయంత్రం వాకింగ్ చేసేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో చిల్ట్రన్ పార్కు ఏర్పాటు చేయడం, అందులో అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం, కట్టకు వెలుపల మొత్తం పచ్చని గ్రాస్ పెంచడం, రకరకలా పూల మొక్కలు నాటే అవకాశం ఉంది. అలాగే చెరువులో నిత్యం నీళ్లుంటున్నందున బోటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేయడంతో పాటు ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఎల్లమ్మ చెరువును రూపుదిద్దబోతున్నారు. ఈ పనులు పూర్తయితే హుస్నాబాద్ పట్టణానికి మరింత ప్రాధాన్యం పెరగనున్నది. త్వరలోనే పనులు ప్రారంభమై ఎల్లమ్మ చెరువు పర్యాటక ప్రాంతంగా మారాలని ఆశిద్దాం.
మంత్రి, ఎమ్మెల్యే కృషితోనే నిధుల కేటాయింపు
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. వారి కృషి వల్లనే అదనపు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కట్ట పనులు కొంత వరకు పూర్తయినప్పటికీ ఇంకా మిగులు పనుల కోసం ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తయితే ఎల్లమ్మ చెరువు ప్రాంతం పర్యాటకులతో సందడిగా మారనున్నది. హుస్నాబాద్ పట్టణానికి కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు.
– ఆకుల రజితావెంకట్, మున్సిపల్ చైర్పర్సన్, హుస్నాబాద్