కౌడిపల్లి/ కొల్చారం, అక్టోబర్ 18 : విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, సులభతరంగా పాఠాలు బోధించాలని ఉపాధ్యా యులకు జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రం కౌడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, సులభతరంగా నేర్చుకునే విధంగా పాఠాలు బోధించాలన్నారు. ఉత్తీర్ణత శాతం మరింత పెరగాలని, ఆ దిశగా విద్యార్థులకు బోధించాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుభాష్, ప్రధానోపాధ్యాయులు సర్వేశ్వర్, శ్రీనివాస్‌రావు, టీచర్లు ఉన్నారు.
తొలిమెట్టు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పునాది
తొలిమెట్టు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పునాది అని డీఈవో రమేశ్‌కుమార్ అన్నారు. కొల్చారం మండలంలోని పాఠశాలలను డీఈవో ఆకస్మికంగా చేశారు. ఈ సందర్భంగా చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో ఉపాధ్యాయు ల బోధన, విద్యార్థుల భాగస్వామ్యాన్ని, బోధనోపకరణాల వినియోగం, తొలిమెట్టు రికార్డులను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలపారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి సుభాష్ ఉన్నారు.
చదవడం.. రాయడం నేర్పాలి: నోడల్ ఆఫీసర్లు రవీందర్రావు, విఠల్
పాఠశాలల్లోని విద్యార్థులకు కచ్చితంగా చదవడం, రాయడం నేర్పించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు నోడల్ అధికారి రవీందర్రావు, ఆర్పీ నాగేశ్వర్రావు సూచించారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్ పరిధిలో చిన్నతండాలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చదవించడంతోపాటు రాయించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ను పరిశీలించి, అక్కడి సౌకర్యాలను చూసి ప్రభుత్వానికి నివేదికను ఇస్తామన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్ధ్యాలను పెంచడమే లక్ష్యంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తు న్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు సరాఫ్ ఇంద్రసేనాచారి, రాజేశ్వరి, పద్మ ఉన్నారు.
కనీస అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపర్చాలి
ప్రతి విద్యార్థికి మౌలిక, భాషా, గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం తొలిమెట్టుపై అవగాహన ఉండాలని చిలిపిచెడ్ పాఠశాల నోడల్ అధికారి విఠల్ పేర్కొన్నారు. శీలాంపల్లి, సోమక్కపేట పాఠశాలలను సదర్శించి, ప్రతి విద్యార్థి అభ్యాసన స్థితిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్స్, పీరియడ్ ప్లాన్‌తోపాటు విద్యాబోధనను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్, శ్రీనుబాబు పాల్గొన్నారు.