మెదక్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ల్యాబ్‌లు, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లలో నిబంధనలు పాటింపు నీళ్లపై రాతలే.! ఆయా సెంటర్లలో కనీసం ధరల పట్టికలు కూడా ఉండవు. అనధికారికంగా పరీక్ష కేంద్రాలు నడుపుతూ రోగుల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహకులు, వైద్యులు కుమ్మక్కై, వివిధ ఆరోగ్య పరీక్షల పేరుతో రోగులను నిలువునా దోచుకుంటున్నారు. కొందరు వైద్యులు రోగులకు అవసరం లేకున్నా రక్త, మూత పరీక్షలు చేయించాలని రాస్తున్నారు. దీంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట పట్టణాల్లో ప్రైవేట్ ల్యాబ్‌లు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ల్యాబ్‌ల్లో అనర్హులతో పరీక్షలు చేయిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ, రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు.
అనుభవం లేని వారితో ల్యాబ్‌ల నిర్వహణ..
మెదక్ జిల్లాలో 160 ప్రైవేట్ దవాఖానలు ఉండగా, 44 స్కానింగ్ కేంద్రాలున్నాయి. 44కి పైగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్లు ఉన్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్లను తీసుకొచ్చి దవాఖానలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లల్లో డీఎంఎల్టీ, రేడియాలజిస్ట్, ఫార్మాసిస్ట్ కోర్సులు చదవకున్నా కేవలం నామమాత్రంగా అనుభవం ఉన్న వారితో కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో మెడికల్ దుకాణాలు పేరు ఒకరిదైతే మరొకరు వ్యాపారం చేసుకుంటున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. జనరిక్ పేరుతో అడ్డదిడ్డంగా మందులు అంటగట్టి దోచుకుంటున్నారు. ఇచ్చిన మందులకు బిల్లులే ఇవ్వడం లేదు. సీటీ స్కానింగ్‌ల పేరిట భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. స్కానింగ్ రెఫర్ చేసిన డాక్టర్లకు స్కానింగ్ సొమ్ములోనూ కమీషన్లు ఇస్తున్నారు. అవసరం లేకున్నా స్కానింగ్‌లు చేస్తున్నారు. ఆర్ఎంపీల మాటలతో నర్సింగ్‌హోంలకు వస్తున్న జ్వరపీడితులకు అవసరం లేని పరీక్షలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పరీక్షల పేరిట వసూలు చేసిన సొమ్ములో ఆర్ఎంపీలకు కమీషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఇలా…
ల్యాబ్ నిర్వహణకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీ చేసింది. అవి పాటించకుంటే ల్యాబ్‌లను మూసివేసే అధికారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు అర్హులై ఉండాలి అంటే పారామెడికల్ బోర్డులో సభ్యుడై ఉండాలి. ఎంఎల్టీ, డీఎంఎల్టీ వారు ఏదైనా పరీక్ష చేసినట్లయితే అర్హులైన వైద్యుడు దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు..
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కానింగ్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, ఎక్స్‌రే సెంటర్లపై చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్‌లను త్వరలోనే తనిఖీలు చేస్తాం. ప్రతి ల్యాబ్‌లో పరీక్షల వివరాలు, వాటికి అయ్యే ఖర్చుల వివరాల బోర్డులు పెట్టేలా చూస్తాం. అర్హులైన వారితో పరీక్షలు చేయించాలి. లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల తనిఖీల్లో నోటీసులు కూడా ఇచ్చాం. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవు.
– డాక్టర్ విజయనిర్మల, డీఎంహెచ్‌వో మెదక్