పుల్కల్, అక్టోబర్18: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నది. ప్రాజెక్టును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడితో చేపల ఫ్రై దుకాణాల వద్ద సందడిగా మారింది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వాహనాలను ప్రాజెక్టు దిగువ భాగానే నిలిపి జనాలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు నిండుకుండను కనిపిస్తుండడంతో పర్యటకులను అధికారులు ప్రాజెక్టుపైకి అనుతించడం లేదు.
కొనసాగుతున్న వరద ప్రవాహం
సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న నీటి తీవ్రతను అధికారులు అంచనా వేస్తూ, ప్రాజెక్టు సామర్థ్యాన్ని బట్టి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రాజెక్టులో 29.048 టీఎంసీల నీరునిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో 22427 క్యూసెక్యులు, అవుట్ ఫ్లో 18006 క్యూసెక్యుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ఆశాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వివరించారు. సోమవారం రాత్రి వరకు వస్తున్న నీటి సామర్థ్యాన్ని బట్టి రెండు గేట్లు ఎత్తగా మంగళవారం ఉదయం వరకు నీటితీవ్రత తగ్గడంతో ఒక గేటును మూసివేసి, ఒకే గేటు ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.