సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గ్రూప్1 పరీక్ష సజావుగా జరిగింది. రెండు గంటల ముందు నుంచే బయోమెట్రిక్ విధానం.. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కొంతమంది చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులతో సెంటర్లకు చేరుకున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాల్లో 3293 మంది అభ్యర్థులకు 2,677 మంది హాజరవగా, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్‌లు పలు సెంటర్లను సందర్శించి నిర్వహణ తీరు, మౌలిక వసతులను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో 26 కేంద్రాల్లో 8,654 అభ్యర్థులకు 6,650 మంది పరీక్ష రాశారు. కలెక్టర్ శరత్ వివిధ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ అర్బన్/ సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 16:రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సజావుగా జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన 26 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,654మంది అభ్యర్థులకు 6,650 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 2004 మంది అభ్యర్థులు గైర్హాజరవగా, 76.84 శాతం హాజరు నమోదయ్యింది. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను సంగారెడ్డి కలెక్టర్ శరత్ సందర్శించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల, కరుణ హై స్కూల్, పటాన్‌చెరులోని సేయింట్ జోసెఫ్ హై స్కూల్, రామచంద్రాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సదాశివపేటలోని భవిత జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.
పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లను అభ్యర్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో మెదక్‌లో 4, నర్సాపూర్‌లో 1, తూప్రాన్‌లో 2 పరీక్ష కేంద్రాల్లో 3293 మంది అభ్యర్థులకు 2,677 మంది హాజరయ్యారని, 616 మంది అభ్యర్థులు గైర్హాజరుకాగా, 81.29 శాతం హాజరు నమోదయ్యింది. మెదక్‌లోని గీతా జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టక్ ప్రతిమాసింగ్ పరిశీలించగా, నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేశ్ పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశాలతో వంద శాతం బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థులను రెండు గంటల ముందే కేంద్రాల్లోకి అనుమతించినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 20 పరీక్షా కేంద్రాల్లో 7,786 మంది అభ్యర్థులకు గానూ 6,475 మంది అభ్యర్థుల హాజరు కాగా, 83.16 హాజరు శాతం నమోదైంది. సిద్దిపేట పట్టణంలోని ఎస్ఆర్కే డిగ్రీ కళాశాల, బీఎంఆర్ డిగ్రీ కళాశాల, విజ్వల జూనియర్ కళాశాల, పారుపల్లి ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల, వికాస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను సీపీ శ్వేత పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు, బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు. ఉదయం 10:15 తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన నలుగురు అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపించారు. కలెక్టర్, సీపీతో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఆర్డీవో అనంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, అభ్యర్థులకు కలెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు.