పాపన్నపేట, అక్టోబర్16: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజులుగా మంజీరా నది దుర్గామాత ఆలయం ఎదుట నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో రాజగోపురంలోనే పూజలు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి సింగూరు ప్రాజెక్టుకు వరద భారీగా చేరడంతో నీటిని వదిలాదు. దీంతో ఆలయం ఎదుట నుంచి నీరు ప్రవహించడంతో ఏడుపాయల్లో భక్తులు భారీగా రావడంతో పర్యాటక కళ సంతరించుకున్నది.
పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తూ బోనాలు, పసుపు కుంకుమ సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఆలయ చైర్మన్ బాలాగౌడ్, దేవాదాయశాఖ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, సూర్యశ్రీనివాస్, రవివీర్కుమార్, నరసింహులు, యాదగిరి, వరుణాచారి, నరేశ్‌తో పాటు పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు.
కేతకీ వనంలో భక్తుల పూజలు
ఝరాసంగం, అక్టోబర్16: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు చేశారు. ప్రత్యేకంగా దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ, పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఝరాసంగం ఎస్సై రాజేందర్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.