నర్సాపూర్, అక్టోబర్15: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో దేశానికి ఉపయోగపడే కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) సుచిత్రా ఎల్లా విద్యార్థులకు సూచించారు. శనివారం నర్సాపూర్ పట్టణ శివారులోని బీవీఆర్ఐటీ కళాశాల రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీపీఆర్ఐటీ ఫౌండర్ బీవీ రాజు 102వ జయంతిని ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హైదరాబాద్) సుచిత్రా ఎల్లా హాజరై కళాశాలలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ నూతన బ్లాక్‌కు డా.ఈ లక్ష్మీనర్సయ్య మెమోరియల్ సిల్వర్ జూబ్లీ బ్లాకుగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీవీ రాజు ఒక మంచి ఉన్నతమైన ఆశయం, విద్య కోసం కృషి చేశారని, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నేడు తమ సంస్థ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవిడ్ నిరోధక ఇంజక్షన్(కొవాక్సిన్)కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. ఇది ఇప్పటి కష్టం కాదని 25 ఏండ్లుగా చేస్తున్న పరిశోధనలు దేశానికి ఉపయోగపడ్డాయని చెప్పారు.
1996లో మొదటిసారిగా తాము ఏపీజే అబ్దుల్ కలాంను కలిశామని, ఆయన దేశానికి అవసరమైన మూడు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయమని చెప్పారని, అవి 1.హెపటైటీస్ బీ వ్యాక్సిన్ 2. ఎయిడ్స్ టీకా 3) మలేరియా టీకా అని గుర్తుచేశారు. వారు చెప్పిన వాటిలో 25 ఏండ్లలో రెండు తీర్చామని, ఇంకా పరిశోధనలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి వారి ఆశయాలు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా దేశానికి ఉపయోగపడాలని చెప్పారు. అనంతరం బీపీఆర్ఐటీ కళాశాల, విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కేవీ విష్ణురాజు మాట్లాడుతూ తమ కళాశాలలో అన్ని విభాగాల కోర్సులు అందిస్తూ, బీవీ రాజు ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల, విష్ణు విద్యాసంస్థల వైస్ చైర్మన్ రవిచంద్రణ్ రాజగోపాల్, సెక్రటరీ ఆదిత్య విస్సం, ప్రిన్సిపాల్ డా.కె.లక్ష్మీప్రసాద్, మేనేజర్స్ బాపిరాజు, అశోక్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.