సంగారెడ్డి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమవుతున్నది. ఈ సీజన్లో ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ.6380 మద్దతు ధరను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా సంగారెడ్డిలో మొత్తం 3,45,440 ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. ఈసారి అధిక వర్షాలతో పత్తిపంట చాలాచోట్ల దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడికి మించి వచ్చే అవకాశం లేదని అధికారుల పేర్కొంటున్నారు. జిల్లాలో 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లు ఈ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
పత్తి కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో రైతు లు 3,45,440 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సా గు చేశారు. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నదని అధికారులు అంచనా వే స్తుండగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నా రు. ప్రభుత్వం జిల్లాలో మొత్తం 18 సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ.6,380 మద్దతు ధర కల్పిస్తున్నది. దీపావళి తర్వాత దూది తీత మొదలు కానుండగా, నెలాఖరు నుంచి కొనుగోళ్లను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
3,45,440 ఎకరాల్లో పత్తి సాగు
ఈ ఏడాది రైతులు పత్తిసాగుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. వానకాలంలో 3,45,440 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంటబాగా పండిందని రైతులు చెబుతున్నారు. అధికారుల అంచనా మేరకు ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల పంట దిగుబడి రానున్నదని చెబుతున్నారు. నెలాఖరు వరకు పత్తితీత ప్రారంభం కానుండగా, కొనుగోలు కూడా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ, మార్కెటింగ్ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవలే అదనపు కలెక్టర్ పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మార్కెటింగ్, సీసీఐ, జిన్నింగ్ మిల్లులు యాజమానులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 18 కొనుగోలు కేంద్రాలు
సంగారెడ్డి జిల్లాలో ఈనెలాఖరు నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించేందుకు సీసీఐ సన్నద్ధమవుతున్నది. ఈమేరకు మార్కెటింగ్ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నది. జిల్లాలో ఐదు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో మొత్తం 18 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. సదాశివపేట మార్కెట్ కమిటీ పరిధిలో సదాశివపేట పట్టణం, చందాపూర్, ఎనికేపల్లిలో జిన్నింగ్ మిల్లులు ఉండగా, రాయికోడ్ మండలంలో నాగ్వార్ చౌరస్తాలో రెండు జిన్నింగ్ మిల్లులు, మునిపల్లి మండలంలోని మేళాసంగంలో మూడు జిన్నింగ్ మిల్లులు, వట్పల్లి మార్కెట్ పరిధిలోని చేవెళ్లలో ఒక జిన్నింగ్ మిల్లు ఉన్నది. నారాయణఖేడ్ మండలం తాతేగావ్, నగల్‌గిద్ద మండలం ఫసల్వాడిగావ్లో రెండు, కంగ్టి మండటం తుర్కవాడగౌవ్, ముగ్జల్, మనూరు మండలం దవ్వూరులో ఒక్కోటి చొప్పున జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. అందోల్ మండలం ఎల్లారం, రాంసాన్పల్లి, పుల్కల్లో ఒక్కో జిన్నింగ్ మిల్లులున్నాయి.
18 జిన్నింగ్ మిల్లులు పరిధిలో 18 పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించగా, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించింది. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పత్తి కొనుగోలు బాధ్యతలను రెండుశాఖల అధికారులకు అప్పగించింది. ఈనెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సీసీఐ సన్నద్ధమవుతున్నది. త్వరలో కలెక్టర్ అధ్యక్షతన పత్తి కొనుగోలు కేంద్రాల ప్రా రంభ తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కం టే పత్తి ధర బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్న పక్షంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభు త్వం పత్తి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.6,380 గా ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.8 వేలు దాటే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా పత్తి ధర లు పెరగటంతోపాటు పత్తి గింజలు, నూనె ధరలు పెరిగాయి. దీంతో పత్తి ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సీసీఐకి పత్తి అమ్మేందుకు రైతులు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువ. అప్పుడు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలు ఉండకపోచ్చు.
పత్తి క్వింటాల్‌కు రూ.6,380
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 14: జిల్లాలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లో పత్తి కనీస మద్దతు ధరను నిర్ణయించినట్టు సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. పొడవు పింజ పత్తి రకానికి రూ.6,380, పింజ రకానికి రూ.6080 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించినట్టు వివరించారు. మొక్కజొన్న, కందులు, పెసలు, వేరు శనగా, మినుములు, పొద్దు తిరిగుడు, సోయాబీన్, నువ్వులు, జొన్నలు, సజ్జలు, రాగులు తదితర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లను వరి కొనుగోలు కేంద్రాల వద్ద, జిన్నింగ్ మిల్లుల వద్ద, గ్రామ పంచాయతీల్లోని ప్రధాన కూడళ్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.