సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 13 : ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సిద్దిపేట పట్టణంలో 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్‌పై ఫొటో సరిగా ప్రింట్ కాకపోతే మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు నమోదు ఉన్న దృష్ట్యా ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో 10:15 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ప్రభుత్వ ఎంప్లాయీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లో ఏదో ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వాచ్, షూ, పర్స్, హ్యాండ్ బ్యాగ్‌లు, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించమని తెలిపారు. టీఎస్పీఎస్సీ నిబంధనలు పాటించి ఓఎంఆర్ షీట్‌ను జాగ్రత్తగా నింపి అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని తెలిపారు.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 13 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలోని విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి రాష్ట్ర పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ శ్వేత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ ఫిల్మ్ మూడు నిమిషాల నిడివితో, గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేటి వరకు తీసిన మూడు ఫొటోలను తమ పూర్తి వివరాలతో పెన్ డ్రైవ్‌లో కానీ, డీవీడీలో కానీ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లోని పీఆర్వో సెక్షన్లో అందజేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, కమ్యూనిటీ పోలిసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తిప్రతిష్టలను పెంపొందించే పలు అంశాలపై ఫొటోగ్రఫీ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ తీయాలన్నారు. పోటీలో గెలుపొందిన ముగ్గురికి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీ పిలుపునిచ్చారు.