నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాటిపై కొరడా ఝుళిపిస్తున్నది. దవాఖానలు సీజ్ చేయడంతో పాటు తాఖీదులు ఇస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల ప్రత్యేక వైద్య బృందాలు 330 దవాఖానలను తనిఖీ చేశాయి. ఇందులో 91 దవాఖానలకు నోటీసులు జారీచేయగా, మరో 20 దవాఖానలు సీజ్ చేశారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 16 దవాఖానలు సీజ్ అయ్యాయి. తనిఖీల సమయంలో ప్రత్యేక బృందాలు దవాఖానల రిజిస్ట్రేషన్, వసతులు, చార్జీలు, వైద్యులు, సిబ్బంది, ఇతరత్రా వివరాలు ఆరాతీస్తున్నాయి. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే దవాఖానలపై చర్యలు తప్పవని వైద్యాధికారులు హెచ్చరించారు.
సిద్దిపేట, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రైవేట్ దవాఖానల ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నిచోట్ల అధికారులు ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దవాఖానలు సీజ్ చేయడంతో పాటు మరికొన్ని దవాఖానలకు తాఖీదులు ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్‌లో ఇటీవల ప్రత్యేక వైద్య బృందాలు 330 దవాఖానలను తనిఖీలు చేశాయి. ఇందులో 91 దవాఖానలకు నోటీసులు జారీ చేయగా, మరో 20 దవాఖానలు సీజ్ చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రైవేట్ దవాఖానలకు రిజిస్ట్రేషన్ ఉన్నదా..? రెన్యువల్ చేయించారా..? ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసతులు ఉన్నాయా..? ఉండాల్సిన వైద్యులు, సిబ్బంది ఉన్నారా..? ఏమేమి వైద్యం చేస్తున్నారు..? చార్జీలు, ఇలా పలు అంశాలను బృందాలు ఆరా తీస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు చేసిన తనిఖీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కాగా, కొత్తగా ప్రైవేట్ దవాఖానలను ఏర్పాటు చేసుకునే వారికి అన్ని అనుమతులు ఉంటేనే రన్ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ప్రైవేట్ దవాఖానలో అన్నిరకాల వసతులు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దవాఖాన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ధరల పట్టిక, డాక్టర్ పేరు తదితర వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడో ఉండి ఇక్కడ వేరే వైద్యడిని పెట్టి నడిపించే విధానానికి స్వస్తి పలికేలా చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత వైద్యుడే ఓపీ చూసేలా నిఘా ఏర్పాటు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 330 దవాఖానలు తనిఖీలు నిర్వహించి 91 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. 20 దవాఖానలు సీజ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో 5 బృందాలు 162 దవాఖానల్లో తనిఖీలు నిర్వహించాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 49 దవాఖానలకు నోటీసులు జారీ చేశారు. మరో 4 సీజ్ చేశారు. మెదక్ జిల్లాలో 82 దవాఖానల్లో తనిఖీలు నిర్వహించి, 8 దవాఖానలకు నోటీస్‌లు జారీచేశారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా16 దవాఖానలు సీజ్ చేయగా, 34 దవాఖానలు నోటీసులు జారీచేశారు. ఈ జిల్లాలో 7 బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 20 దవాఖానలకు జరిమానా విధించారు. 2 దవాఖానలు మూసేశారు. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ దవాఖానలు నడుస్తున్నాయి. సంగారెడ్డి పారిశ్రామిక జిల్లా కావడంతో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలో కొంత భాగం ఉండడంతో ప్రైవేట్ దవాఖానలు ఎక్కువగా నడుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ జిల్లాలో నడుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాంటి దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా వైద్యసేవలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ హయాంలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం ప్రభుత్వ దవఖానాల్లో మెరుగైన వైద్యం అందుతున్నది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని రోజులుగా ప్రైవేట్ దవాఖానలపై ప్రత్యేకంగా నియమించబడిన వైద్యాధికారుల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ప్రైవేట్ దవాఖానలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ పేదల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తనిఖీలకు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి పది రోజల పాటు మూకుమ్మడిగా జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులను నియమించి తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బృందాలు ఆయా ప్రైవేట్ దవాఖానలకు ఆకస్మికంగా వెళ్లి వసతులు, సేవలను పరిశీలించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దవాఖానలను నడుపుతున్నారో లేదో పరిశీలించారు.