జహీరాబాద్, అక్టోబర్ 9: ‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’.. అని అన్ని వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు. ఆయన రాకను సబ్బండ వర్ణాలు స్వాగతిస్తున్నాయి. గొప్ప ఆలోచనలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని, ఆయన నాయకత్వంలో దేశాన్ని పాలిస్తే దేశం బాగుపడుతుందని పేర్కొంటున్నారు. గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని, ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతాయని, సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
‘మాకు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ పంటలు పండించేందుకు రైతులకు చేస్తున్న సహాయం మావద్ద పంటలు పండించి అమ్మినా అంత రావడం లేదు. రైతు బంధుతో ప్రతి ఏడాది సమయానికి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. దీంతో తెలంగాణలో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్ పథకాలు ఆదర్శంగా ఉన్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో అమలు చేస్తే రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీని కర్ణాటక ప్రజలు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్-కర్ణాటక (హైకా), గుల్బర్గా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి ప్రజలు తెలంగాణలో ఎందుకు పుట్టలేదాని బాధపడుతున్నారు. ఆసరా పింఛన్ల్లతో తల్లిదండ్రులు ఎక్కువ రోజులు జీవించాలని పిల్లలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తున్నాం..’ అని కర్ణాటకలోని బీదర్ జిల్లా సుల్తాన్పూర్, మాల్కాపూర్, గుల్బర్గా, బీదర్ పట్టణం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ఈ ప్రాం తాల్లో పర్యటించి బీఆర్ఎస్ ఏర్పాటుపై ప్రజ ల అభిప్రాయం సేకరించింది.
ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌ను దేవుడు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్-కర్ణాటక (నిజాం పాలన ప్రాంతం) ప్రజలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని, ఇచ్చే కరెంట్ సైతం నాణ్యతగా సరఫరా చేయకపోవడంతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లతో తెలంగాణలో పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు ఎక్కువ రోజులు జీవించాలని కోరుకుంటున్నారన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేసినా, అర్హులకు అందడం లేదన్నారు. కర్ణాటకలో ఉన్న హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని, ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కన్నడ ప్రజలు స్వాగతిస్తారన్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ జాతీయ స్థాయిలో కీలకంగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను చూస్తే తప్పకుండా సీఎం కేసీఆర్ సేవలు అవసరమని పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొం దడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను స్వాగతం పలికే సమయం వచ్చందన్నారు. మతా లు, కులాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలను ప్రజలు దూరం చేసే సమయం ముక్తకంఠంతో చెబుతున్నారు.
దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించే నాయకుడు
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన దేశాన్ని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చొని చేసిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలను పెంచింది. దీంతో పేదలకు పూట గడవడమే కష్టంగా మారింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ వంటి నాయకులు ఎంతో అవసర. విజన్ ఉన్న నాయకులు భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను కొత్తగా ఏర్పాటు చేయడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారు.
– ఖాదీర్ ఆహ్మద్, భారత్ నగర్, జహీరాబాద్
దేశ ప్రజలకు అండగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్)
భారత దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అండగా ఉంటుందని భావిస్తున్నా. మోదీ సర్కారు నిరుపేదల నడ్డివిరిచే విధంగా పాలన కొనసాగిస్తున్నది. బీజేపీని ఎదుర్కొనే దమ్ము సీఎం కేసీఆర్‌కే ఉంది. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుంది. సీఎం కేసీఆర్‌తోనే రాజకీయాల్లో పెను మార్పులు తథ్యం. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైంది.
– భూర్గు నర్సింహులుగౌడ్, బీసీ సంఘం నాయకుడు, మద్దూరు.
మోదీ ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో మోదీ పభుత్వం రోజు రోజుకు విశ్వాసం కోల్పోతున్నది. రైతువ్యతిరేక సాగుచట్టాలపై పంజాబ్, ఢిల్లీ, హర్యానాతో సహా పలు రాష్ర్టాలు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో దిగివచ్చిన ప్రధాని మోదీ తప్పుడు చట్టాలని విరమించుకున్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు,రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, పండించిన పంటలకు మద్దతు ధర, ధాన్యం కొనుగోలు ఇలా రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు.
– పాశం శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల చైర్మన్, వర్గల్
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర..
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తో దేశంలో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి స్థాయిలోనే దేశంలోనూ అభివృద్ధి చేసి చూపించగలరు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మాకు సుస్పష్టంగా తెలుసు. ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా సీఎం కేసీఆర్ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధిని గుర్తించాలి. దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలి. అన్ని రంగాలపై ఆయన స్పష్టమైన అవగాహన ఉన్నది. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదంలో రెండు రంగాలను అభివృద్ధి పథంలో నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు.
– రాజేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు (జిన్నారం)
కేసీఆర్ కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి
సీఎం కేసీఆర్ కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అసంఘటిత కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అవగాహన ఉంది. ఆయన ప్రధాని అయితే అనేక సంస్కరణలు తెస్తారు. తెలంగాణను అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. సాగునీటి రంగంపై పట్టున్న సీఎం కేసీఆర్‌కు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తారు. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారాల్సిన అవసరం ఇంకా ఉంది. సమస్యల పరిష్కారంలో నిరంతర అన్వేషణ చేసే వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన ఆలోచన విధానాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి.
– వరుకోలు రాజలింగం, సీనియర్ న్యాయవాది, సిద్దిపేట
బీఆర్ఎస్తో అన్ని వర్గాలకు న్యాయం
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ కోసం దేశ స్థాయిలో వివిధ రాష్ర్టాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్ ప్రధాని అయితే దేశ మంతా, ఇక్కడి పథకాలు అమలవుతాయి. అన్ని వర్గాల ప్రజలు, రైతులంతా సంతోషంగా ఉంటారు.
– చిలుముల హన్ముంత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెదక్
సీఎం కేసీఆర్‌తో దేశంలో మార్పు వస్తుంది..
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడంతో దేశ రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కర్ణాటకలోనూ అమలు చేయాలని మా ప్రజలు కోరుకుంటున్నారు. రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోకుండా ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వడం, వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ సరఫరా, రైతులు చనిపోతే రూ. 5 లక్షల సాయం వంటి పథకాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీని మా ప్రజలు స్వాగతిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ప్రతి ఇంటికీ తాగునీరు వస్తున్నది. మహిళలకు తాగునీటి కష్టాలు లేవు.
– శ్యాంరావు, మాజీ పంచాయతీ చైర్మన్ మాల్కాపూర్, బీదర్ జిల్లా (కర్ణాటక)