సినిమా, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్ చిత్రీకరణలకు కేంద్రం ఉమ్మడి జిల్లాలోని భెల్ ప్రాంతం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు కనిపిస్తాయి. ఎటు చూసినా ప్రకృతి అందాలు మనల్ని అలరిస్తాయి. చుట్టూరా ఆటవీప్రాంతం తలపించేలా చెట్లతో పచ్చదనాన్ని అలవర్చుకుని ఉంటుంది. జనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటుంది. అనువైన ప్రాంతం, అందమైన ప్రదేశం.., ప్రకృతి తన అందాలను ఆరబోస్తూ ఉండే బీహెచ్ఈఎల్ అంటే ఇప్పుడు షూటింగ్‌లకు కేరాఫ్‌గా మారింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈప్రాంతంలో ఇప్పుడు షూటింగ్‌లు జోరు సాగుతున్నది.
రామచంద్రాపురం, అక్టోబర్ 8: ప్రశాంతత కోరుకునే వారు, స్వచ్ఛమైన గాలిని పీల్చాలనుకునే వాళ్లు భెల్‌కు వచ్చి కొంత సేపు సేద తీరుతారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ల సందడి మొదలైంది. గతంలో మాదిరిగా సినిమా వాళ్లు ఈ ప్రాంతంలో సన్నివేశాలను చిత్రీకరించేందుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే చాలా సినిమాలకు సంబంధించిన సినిమా షూటింగ్‌లు ఈ ప్రాంతంలో జరిగాయి. విశాలమైన రోడ్లు, మైదానాలు, బస్‌స్టాప్, పార్కులు, కమ్యూనిటీ సెంటర్, వాకింగ్ ట్రాక్, క్వార్టర్స్, గ్రీనరీ ఇలా చెప్పుకుంటూ పోతే మన భెల్‌లో సినిమాకు సంబంధించిన చాలా లొకేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న భెల్ ప్రాంతంలో ఉన్న లొకేషన్లు చుట్టుపక్కల ఎక్కడా లేవు. దీంతో ఈ మధ్యకాలంలో సినిమాల దృష్టి భెల్ మీద పడింది. సినిమాలను చిత్రీకరించేందుకు ఇక్కడికి లైన్ కడుతున్నారు.
భెల్‌లో సినిమా షూటింగ్‌ల సందడి..
భెల్‌లో సినిమా షూటింగ్‌ల సందడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాలంలో సుమారుగా రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌కు సంబంధించిన సన్నివేశాలను ఈ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా షూటింగ్ భెల్‌లో జరిగింది. ఒక వెబ్ సిరీస్, ప్రముఖ హీరో వైష్ణవ్‌తేజ్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను భెల్‌లో చిత్రీకరించారు. భెల్ సినిమా షూటింగ్ జరుగుతుండడంతో స్థానికులు, భెల్ మీదుగా ప్రయాణించే వారు షూటింగ్‌లను చూస్తూ ఆనందిస్తున్నారు.
భెల్‌కు పూర్వవైభవం..
గతంలో బీహెచ్ఈఎస్లో ఎన్నో సినిమా షూటింగ్‌లు జరిగేవి. భెల్‌లో ప్రతి రోజు ఏదో ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతుండేది. బాలకృష్ణ, పవణ్‌కల్యాణ్, వెంకటేశ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, నితిన్, సిద్ధార్థ్ ఇలా ఎంతో మంది హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి సినిమా షూటింగ్‌లు జరుగలేదు. ప్రస్తుతం భెల్‌లో తిరిగి సినిమా షూటింగ్‌ల జోరు పెరిగింది. అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, తమ్ముడు, వాసు, బొమ్మరిల్లు, సై, యోగి, సాంబ, బాబీ, మగధీర తదితర సినిమాల షూటింగ్‌లు భెల్‌లో జరిగాయి.

షూటింగ్‌లకు అనువైన లొకేషన్లు..
సినిమా షూటింగ్‌లకు భెల్‌లో అనువైన లొకేషన్లు ఉన్నాయి. ఎటు చూసినా పచ్చని చెట్లతో ఈ ప్రాంతమంతా గ్రీనరీగా కన్పిస్తుంది. భెల్ పరిసరాలు ప్రశాంతంగా ఉండడంతో సినిమా షూటింగ్‌లు ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవచ్చు. సన్నివేశాలకు అనుకూలంగా పరిసరాలను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అడవిని తలపించే ప్రదేశాలు, విశాలమైన బీటీ రోడ్లు, బస్‌స్టాప్, రోడ్డుకు ఇరువైపుల చెట్లు, నర్సరీ, స్కూల్స్, గ్రౌండ్స్, ఆడిటోరియం, పార్కులు, ఇండ్లు, దేవాలయాలు, ఫంక్షన్‌హాల్స్, స్విమ్మిగ్ ఫూల్, రకరకాల సెట్టింగ్స్ వేసుకోవడానికి అనువైన స్థలాలు ఇలా సినిమాలకు సంబంధించి భెల్‌లో అనేక రకాల లొకేషన్లు, సౌకర్యాలు ఉన్నాయి.