దుబ్బాక టౌన్, అక్టోబర్ 7 : ‘ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ముఖం మొగులుకు పెట్టి చూస్తుండే.. పంచాంగ శ్రవణం విని, కాలం తీరు పంటలు వేసుకుంటుండే.. కానీ, నేడు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు రైతులు పండిస్తున్నారు. కాలం అయినా, కాకపోయినా కాళేశ్వరంతో ఇటు తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఏమి చేయలేదు.. రైతుల కష్టాలను తీర్చలేదు.. కానీ, నేడు సీఎం కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని ఓ ఫంక్షన్హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మ కమిటీతో పాటు దౌల్తాబాద్, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తానని ప్రకటించి, అరిగోస పెడుతున్నదన్నారు. వ్యవసాయ కరెంట్ మీటర్లపై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ, రాష్ర్టానికి వచ్చే రూ.12వేల కోట్లు ఎందుకు ఆపారో స్పష్టం చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు రూ. 57,880 కోట్లు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాయం చేసిందన్నారు. ఇక రైతుబీమా ద్వారా రూ.4,333 కోట్లతో 87 వేల రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సహాయం అందించి ఆదుకున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి స్కీంలు అమలు జరుగుతున్నాయా? అని మంత్రి ఎద్దేవా చేశారు.
రోజుకో నాయకుడు ఢిల్లీ నుంచి వచ్చి గల్లీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టుతూ కేంద్రంలో అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధును పీఎం కిసాన్ సమ్మాన్ యోజనగా, మిషన్ కాకతీయను అమృత్ సరోవర్‌గా, మిషన్ భగీరథను ఘర్ఘర్కు జల్‌గా, సంచార పశువైద్యం 1962ను దేశమంతంటా ఇదే నెంబర్‌తో అమలు చేస్తున్నారన్నారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఇస్తున్న స్ఫూర్తి అని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని అనేక సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం నాంది పలుకుతూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండడం మనకు ఎంతో గర్వ కారణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24గంటల ఉచిత కరెంట్ అమలు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచి పేదలు, రైతులకు గుదిబండగా మారిందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు బానాల శ్రీను, వంశీకృష్ణ, రణం శ్రీనివాస్, జీడిపల్లి రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, అధికం బాలకిషన్‌గౌడ్, పల్లె రామస్వామిగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా నమిలి భాస్కరాచారితో పాటు 30మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయగా, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇప్ప లక్ష్మితో పాటు 17మంది డైరెక్టర్లు, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దోమల కొమరయ్య యాదవ్‌తో పాటు 17మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్లను, పాలకమండలి సభ్యులను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అభినందించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామగ్రామాన రచ్చబండ ద్వారా ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకలు, కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. చేసిన పనిని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, నిర్భయంగా ప్రతి పథకాన్ని గడపగడపకూ చేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లె, పట్టణం అద్భుతంగా మారి, దేశానికే దిక్సూచిలా మారాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు దగా కోరు పనులు చేస్తున్నదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల ముందు ఉంచే సమయం ఆసన్నమైందని, సర్పంచ్ మొదలుకొని కార్యకర్త వరకు బాధ్యతగా ప్రచారం చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
బీఆర్ఎస్ ఇక దేశంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల నుంచే ప్రారంభమైందని, అదే తరహాలో జాతీయ స్థాయిలో ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం శుభ సూచకమన్నారు. పార్టీ అభివృద్ధికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తారని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.