సిద్దిపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేదోడి సొంతింటి కలను తెలంగాణ సర్కారు సాకారం చేస్తున్నది. రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబాలు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు రెండు పడకల గదుల ఇండ్లు ఒకేచోట కట్టించి ఇస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 26,674 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 20,531 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి, మెజార్టీ ఇండ్లను పూర్తి చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 7,536 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 7,149 ఇవ్వడానికి సిద్ధ్దంగా ఉండగా, లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. పచ్చని పందిళ్లు వేసి, లబ్ధ్దిదారులకు కొత్త బట్టలు పెట్టి, నయాపైసా ఖర్చు లేకుండా ఇండ్లను అందించి గృహప్రవేశాలు చేయిస్తున్నది.
ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేక రేకుల షెడ్డు, పూరి గుడిసెలో ఉన్న వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పడకల గదుల ఇండ్లు ఒకేచోట కట్టించి ఇస్తున్నది టీఆర్ఎస్ సర్కారు. పేదలు, నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జోరుగా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధ్దిదారులకు ఇండ్లను అందిస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌లో జోరుగా గృహప్రవేశాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 26,674 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 20,531 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి, మెజార్టీ ఇండ్లను పూర్తి చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాల్లో కలిపి 7,536 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 7,149 ఇవ్వడానికి సిద్ధ్దంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది.
నయా పైసా ఖర్చు లేకుండా గృహయోగం
సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా రెండు పడకల ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రధాన పట్టణాల్లో మోడల్ కాలనీలను నిర్మించారు. రెండు, మూడు అంతస్తులతో నిర్మాణాలు చేయడంతో అవి గేటెడ్ కమ్యూనిటీ భవనాలను తలపిస్తున్నాయి. తాగునీరు, మురుగుకాల్వలు, రహదారులు, విద్యుత్ దీపాలు, పార్కులు ఇలా సకల సౌలత్‌లను కల్పించారు. సిద్దిపేట కేసీఆర్ నగర్ మోడల్ కాలనీ దేశంలోనే ఆదర్శం అని చెప్పాలి. పచ్చని పందిళ్లు వేసి, లబ్ధ్దిదారులకు కొత్త బట్టలు పెట్టి, నయాపైసా ఖర్చు లేకుండా ఇండ్లను అందించి గృహప్రవేశాలు చేయిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో 15,929 ఇండ్లు మంజూరు కాగా, 12,531 ఇండ్ల పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,225కు పైగా ఇండ్లను అందించారు. మరో 4,647 రెడీగా ఉన్నాయి. వీటికి లబ్ధ్దిదారుల ఎంపిక చురుగ్గా కొనసాగుతున్నది. జిల్లా మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఆయా గ్రామాల్లో పూర్తయిన ఇండ్లను లబ్ధ్దిదారులను ఎంపిక చేసి అందిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం, పంపిణీలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి నిర్మాణాలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి.
కేసీఆర్‌కు సార్‌కు రుణపడి ఉంటాం..
మా ఆయన ఆటో నడిపితే వచ్చే డబ్బులే మాకు జీవనాధారం. ఆటో నడవని రోజు మాకు పస్తులే. మాకు ఇద్దరు ఆడపిల్లలు. 20 ఏండ్లుగా అద్దె ఇండ్లలో ఉంటూ, ఆటో నడుపుకుంటూ వచ్చే కొద్దిపాటి సంపాదనంతా ఇంటి కిరాయిలకే పోయేది. కిరాయి ఇండ్లలో ఓనర్లు పెట్టే కండీషన్లతో వేగలేకపోయేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం మాలాంటి నిరుపేదలకు వరంలా మారింది. లాటరీలో మొట్టమొదటి పేరు నాదే రావడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఆత్మ గౌరవంతో తలెత్తుకుని జీవించగలుగుతున్నాం. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– చుక్క కౌసల్య, లబ్ధిదారు, తూప్రాన్ పట్టణం (మెదక్ జిల్లా)
సొంతింటి కల నెరవేరింది..
సొంతింటి కల ఈ జన్మలో నెరవేరుతుందో లేదో అనుకున్నాం. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మావి. దరఖాస్తు చేసుకుని మా పనుల్లో మేం మునిగిపోయాము. ఎలాంటి పైరవీలు లేకుండానే అధికారులే మీకు ఇల్లు వచ్చిందని ఫోన్‌చేసి చెప్పారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మా సొంతింటి కలను నెరవేర్చిన దేవుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– సర్గల కవిత,తూప్రాన్ పట్టణం(మెదక్ జిల్లా)
కిరాయి ఇల్లు బాధ తప్పింది..
మాకు సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటే కిరాయి కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేసీఆర్ ప్రభుత్వం మాలాంటోళ్లకు గింత మంచిగ డబుల్ బెడ్రూం ఇంటిని కట్టించింది. మాకు ఇల్లు ఇప్పించిన వార్డు కౌన్సిలర్ లక్ష్మి అక్కకు , మా ఎమ్మెల్యే మేడమ్ పద్మా దేవేందర్‌రెడ్డి అక్కకు ధన్యవాదాలు. మాలాంటోళ్లకు అండగా నిలుస్తున్న దేవుడు సీఎం కేసీఆర్ సార్.
– తాలరి సుకన్య, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారు, మెదక్ పట్టణం