గజ్వేల్, సెప్టెంబర్ 29 : ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని ఆర్ఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంగ మల్లేశం అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ ఆర్ఎంపీలు, పీఎంపీల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు గ్రామీణ స్థాయిలో అత్యవసర వైద్యసేవలందిస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా ల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలకు సీఎం కేసీఆర్ చొరవతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా అందజేశారన్నారు.
సిద్దిపేట జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీలకు కూడా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించి, ఆర్ఎంపీ, పీఎంపీల సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్‌కు విన్నవించారు. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్ మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిధిలో మాత్రమే సేవలందించాలని సూచించారు.
ఆర్ఎంపీల సంఘం సూచనలు ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. ఆర్ఎంపీలు తమ పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని, అలాగే, తాము సేవలందించే వద్ద క్లినిక్, హాస్పిటల్, దవాఖాన అని బోర్డులు పెట్టకూడదని, కేవలం ప్రథమ చికిత్సాలయం అని మాత్రమే బోర్డులు పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్ రవీందర్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలు పాల్గొన్నారు.