‘ఒక ఉద్యమాన్ని విజయపథంలో నడిపి రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే అంతా శుభప్రదమే.. ప్రజల సాదకాబాధకాలు తెలిసిన మనిషి.. దేశ సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న నాయకుడు.. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త.. ధర్మాన్ని ధైర్యంగా ఆచరించే వ్యక్తి.. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాలకు మహర్దశ పట్టింది.. దేశంలోని ఆలయాలు అభివృద్ధి జరిగి, భక్తులకు వసతులు కలుగుతాయి. కేసీఆర్‌కు మిగతా రాష్ర్టాల స్థితిని తెలుసుకోవడం.. వాటిని పరిష్కరించడం సమస్యే కాదు.. తెలంగాణ ప్రజలంతా ఆయనను దైవంగా భావిస్తున్నారు. పదవులకు వన్నె తెచ్చే గొప్ప లక్షణం ఆయనలో ఉంది’.. అని ధార్మిక వేత్తలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఆయన కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లాంటి నేత దేశానికి అవసరం.జాతీయ పార్టీని ప్రారంభించి దేశం కోసం ముందుకు నడవానికి సిద్ధ్దమవుతున్న సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేయడానకి ముందుకు వస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు తమ మద్దతును తెలియజేయడంతో పాటు సీఎం కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధ్దమవుతున్నారు. దేశంలో కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర జవాన్ల కుటుంబాలకు, రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడంపై యావత్తు దేశం అభినందించింది.
ఈ ఘటనతో ప్రజలు దృష్టి సీఎం కేసీఆర్‌పై పడింది. ఇలాంటి నేత దేశానికి కావాలంటూ అనేక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పూరాతన దేశాలయాలకు పుర్వవైభవం వచ్చింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించి దేవాలయాలను బాగు చేశారు. అర్చకులకు గౌరవప్రదమైన వేతనాన్ని అందిస్తున్నారు. ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆధ్యాత్మిక పరంగా ప్రభుత్వ కృషిని ఆధ్యాత్మిక వేత్తలు సైతం అభినందిస్తున్నారు. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్చూలా మారింది. ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.

ఉద్యమం, సాహసం ధైర్యం, బుద్ధి, కీర్తి, పరాక్రమమ్ అనే ఆరు లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారిని లోకంలోని అందరూ అనుసరిస్తారు. ఆరు లక్షణాలు సీఎం కేసీఆర్‌లో మెండుగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ సాధనాత్ సాధ్యతే సర్వమ్ అనే వాక్కుననుసరించి ఏది ప్రారంభించినా విజయోన్ముఖులై వెళ్తారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో తమ వంతు పాత్ర కోసం సిద్ధపడడం హర్షణీయం. కేసీఆర్ ఆలోచనా విధానం దేశాభివృద్ధికి, దేశంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల చైతన్యానికి ఉపయోగపడి దేశ సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుంది. అన్నివర్గాల ప్రజల మన్ననలను అందుకుంటూ అనుక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రగతికి బాటలు వేశారు. సీఎం కేసీఆర్ దేశంలోని ప్రజలను మెప్పించగలడు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించడం తథ్యం.
– మల్లావఝుల చంద్రశేఖరశర్మ, అర్చకుడు, నర్సాయపల్లి, మద్దూరు మండలం
ధర్మాన్ని ధైర్యంగా ఆచరించడమే గొప్పతనం. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ముందుంటారు. ఎవరు ఎన్ని అన్నా లెక్కచేయకుండా ప్రజలకు అవసరమైన అన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పేద, మధ్య తరగతి ప్రజలంతా సీఎం కేసీఆర్‌ను దైవంగా భావిస్తున్నారు. పదవులకు వన్నె తేవడం కేసీఆర్ గొప్ప లక్షణం. సంతోషిమాత అనుగ్రహంతో మరింత ఉన్నత పదవులు అధిష్టించి దేశ ప్రజలందరికీ మంచి సేవలందించాలి.
– దేశపతి రాజశేఖరశర్మ, సంతోషిమాత ఆలయ ప్రధానార్చకులు, గజ్వేల్ పట్టణ పురోహితులు
సీఎం కేసీఆర్ దూర దృష్టి కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంతటి నాయకత్వ పటిమ గల నాయకుడు దేశంలో ఉండడం దేశ ప్రజలందరికీ గర్వకారణం. అర్చకుల బాధలను గుర్తించి దేవాలయాలకు ధూపదీప, నైవేద్యం కోసం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు డబ్బులను నెలనెలా అందజేస్తున్న మహా నాయకుడు కేసీఆర్. ప్రతి రంగంపై పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు. దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ప్రజలకు మంచి జరుగుతుంది. దేశ ప్రజల బాగు కోసం అకుంటిత దీక్షతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడంపై అన్ని రాష్ర్టాల ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లి విరుస్తున్నాయి. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో రాణించి ప్రజలకు బాగు చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– అప్పన్ కందాడి పార్థసారథి, అర్చకుడు, మిరుదొడ్డి
ఉద్యమాన్ని విజయపథంలో నడిపి రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. దేశ రాజకీయాల్లో వస్తే అంతా శుభప్రదమే. ప్రజల సాదకాబాధకాలు తెలిసిన వ్యక్తి. దేశ సమస్యలపై సమగ్ర అవగాహన ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాలకు మహర్దశ పట్టింది. దేశంలోని ఆలయాలు అభివృద్ధి చెంది, భక్తులకు వసతులు కలుగుతాయి. కేసీఆర్‌కు మిగతా రాష్ర్టాల స్థితిని తెలుసుకొని పరిష్కరించడం సమస్యే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే హక్కుఉంది.
-మహదేవుని మల్లికార్జున్, కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రధానార్చకుడు
తెలంగాణను అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని కూడా అభివృద్ధి చేయడం ఎంతో అవసరం. ఇందుకోసం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం అనివార్యం. తాగునీటి సమస్యలతో దేశవ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారు. మిషన్ భగీరథ లాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు కావాలి. విద్య, వైద్యం దేశ ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలి. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషిస్తే ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతారు. దేశంలో వ్యవసాయంలో మార్చులు జరుగాల్సిన అవసరం ఉన్నది. రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేస్తే రైతులంతా సంతోషంగా ఉండి అందరికీ అన్నం పెడతారు.
– చాడ నందబాలశర్మ, మహంకాళీ ఆలయ ప్రధానార్చకుడు, గజ్వేల్ పట్టణ పురోహితులు
దార్శనికుడు, ధార్మిక వేత్త, రైతు బాంధవుడు, అన్నివర్గాల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమానికి ఊపిరిపోసి తెలంగాణ కలను సాకారం చేసిన మహనీయడు. సంక్షేమంలో తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్ది సుపరిపాలన అందిస్తున్న నాయకుడు. అన్నివర్గాలతో పాటు కవులు, కళాకారులను గుర్తించి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేసిన కళాపోషకుడు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికి దిక్సూచిగా మలిచిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ దేశాన్ని పాలించే సత్తా ఉంది. దేశంలోని సబ్బండవర్గాల అభ్యున్నతి కోసం అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలువాల్సిన సమయం వచ్చింది.
– వెంకటేశ్వర శర్మ, పురోహితులు, రాయపోల్ మండలం
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం అత్యంత శుభప్రదం, శుభశూచికం. ఆధ్యాత్మిక భావం గల వ్యక్తి కేసీఆర్. దేశంలో కేసీఆర్ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తారని నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులకు కేసీఆర్ పెద్దపీట వేస్తారు. మన రాష్ట్రంలో గతంలో అనేక దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలు నోచుకోని ఆలయాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి దేవాలయంలో నిత్యదీపారాధన జరిగేలా నిధులు కేటాయించారు. నేడు వైభోపేతంగా ఆలయాలు విరాజిల్లుతున్నాయి. కేసీఆర్ చాలా దూరదృష్టి కలిగిన నాయకుడు.
– నాగిళ్ల లక్ష్మణామూర్తి, అర్చకుడు, అంతకపేట (అక్కన్నపేట)