తూప్రాన్, సెప్టెంబర్ 18: ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నూటికి నూరు శాతం అర్హులకే ఇండ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మొదటి విడత లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తూప్రాన్‌కు చెందిన మహమ్మద్ గౌస్ ఆదివారం 15వ వార్డులోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలిపాడు. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చేదాక దిగేది లేదని, లేకుంటే అక్కడ నుంచి దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఫోన్లో గౌస్‌తో మాట్లాడారు. తాను వచ్చి మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో గౌస్ కిందికి దిగి వచ్చాడు. హుటాహుటిన తూప్రాన్ చేరుకున్న ప్రతాప్‌రెడ్డి బాధితుడు గౌస్, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి విడతలో పొరపాటున ఇండ్లు వచ్చిన అనర్హులను ఏరివేసి, ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మరోసారి సర్వే చేయిస్తానన్నారు. ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినట్లయితే, స్వచ్ఛందగా వదులుకోవాలని, తద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు బురాన్, ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్, నాయకులు బజారు చక్రవర్తి, హైమద్, అజర్, ఉమర్ పాల్గొన్నారు.