కొండపాక, సెప్టెంబర్ 17 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ల్యాగల మోహన్‌రెడ్డికి గ్రామ శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూ మి ఉంది. ప్రస్తుతం మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా, మరో అర ఎకరంలో పశుగ్రాసాన్ని పెంచుకుంటున్నా డు. మిగతా భూమిలో పశువుల కొట్టం, నాటు కోళ్ల పెంపకానికి స్థలాన్ని కేటాయించాడు. ఇవి పోగా, మిగిలిన మరికొంత స్థలాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ చేపల పెంపకం వైపు అడుగులు వేశాడు. ఆలోచన వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే పనులు చేపట్టాడు. సంవత్సరం కిం ద మొదలు పెట్టిన కొర్రమట్ట(కొర్రమీను) చేపల పెంపకం ఇప్పుడు లక్షల ఆదాయాన్ని కురిపిస్తున్నది.
ఎలా మొదలైంది..
రెండేండ్ల క్రితం ల్యాగల మోహన్‌రెడ్డి అనారోగ్యం కారణంగా విజయవాడ, రాజమండ్రికి వైద్య కోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఓ దవాఖానలో 20 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఓ వ్యక్తి(ఆంధ్రా ప్రాంతానికి చెందిన) అదే దవాఖానలో మోహన్‌రెడ్డికి పరిచమయ్యాడు.
కొద్ది రోజుల్లోనే వీరు మంచి స్నేహితులుగా మారడంతో వారి కుటుంబ విషయాలు, వాళ్లు చేసే పనులు ఒకరికొకరు చెప్పుకున్నారు. మోహన్‌రెడ్డికి పరిచయమైన వ్యక్తి తాను చేపల పెంపకం చేస్తానని చెప్పడంతో పాటు దవాఖాన నుంచి మోహన్‌రెడ్డిని ఇంటికి తీసుకెళ్లడంతో పాటు పని గురించే పూర్తి అవగాహన కల్పించేలా చేశాడు. వచ్చే ఆదాయాన్ని కూడా వివరించడంతో పాటు మోహన్‌రెడ్డికి తను కూడా చేపల పెంపకం చేపడితే బాగుంటుందనే ఆలోచనతో ఇలా మొదలైంది.
ఎంత ఖర్చు.. ఎంత ఆదాయం
చేపల పెంపకం ప్రారంభించాలని సంకల్పించిన మోహన్‌రెడ్డి 6గుంటల స్థలంలో జేసీబీతో లోతైన గుంతను తవ్వించాడు. ఇందుకు సుమారుగా రూ. 60వేలు ఖర్చు అయ్యాయి. తన బోరుబావి నుంచి వచ్చే నీటిని ఆ గుంతలోకి విడిచిపెట్టి అందులో విజయవాడ నుంచి ప్రత్యేకంగా 4వేల కొర్రమీను(కొర్రమిట్టు) చేప పిల్లలను రూ.13 ఒకటి చొప్పున తీసుకొచ్చాడు. ఇందుకు రాను పోను కిరాయిలు కలుపుకొని రూ. 60వేల వరకు ఖర్చు వచ్చింది. పక్షుల నుం చి చేప పిల్లలకు రక్షణ కల్పించాలని నీటి గుంట చుట్టు జాలిని ఏర్పాటు చేశాడు. ఇందుకు మరోక రూ.5వేల వరకు ఖర్చు చేశాడు. ప్రతినెలా చేపలకు దాణా కోసం రూ.12వేలు ఖర్చు చేశాడు. గతేడాది వర్షాకాలంలో మొదలు పెట్టిన చేపల పెంపకం ఒక సంవత్సరకాలం ముగిసేటప్పుటికీ అద్భుతంగా పంట చేతికి వచ్చింది. ఇటీవల మృగశిర కార్తె రోజున చేపలు ద్వారా రూ. 2.5లక్షలు రాగా, తన ఫామ్ వద్దకు వచ్చే వాళ్లతో పా టు తెలిసిన వాళ్లకు తెలిసిన వాళ్లకు అమ్మకాలు జరుపుతూ ఇప్పటివరకు సమారుగా రూ.3లక్షలకు పైగా ఆదాయాన్ని పొందాడు. తాను పెంచిన చేపల్లో సగం మాత్రమే అమ్మకాలు జరిపానని, ఇంకా సగానికి పై గా చేపలు నీటి గుంతలోనే పెరుగుతున్నాయని, కొద్ది రోజుల్లోనే మిగతా చేపలను పట్టి మార్కెట్‌కు పంపి, మరో రూ.3లక్షల ఆదాయం పొందుతానని హర్షం వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. చేపలు కావాల్సిన వారు 7660934733 నెంబర్‌కు ఫోన్ చేసి వస్తే రాంపల్లి-దుద్దెడ శివారులో ఉన్న తన వ్యవసా య బావి వద్ద నుంచి తాజా చేపలను అప్పుడే పట్టిస్తానని, వీటితో పాటు నాటు కోళ్లు సైతం అందుబాటులో ఉన్నాయని రైతు మోహన్‌రెడ్డి తెలిపారు.