మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 14: చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్న జీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి. దీంతో పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, శక్తిహీనత వంటి సమస్యలు వస్తాయి. 1-19 వయస్సు ఉన్న పిల్లలు కొందరు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే ఇంకొందరు నులి పురుగుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చిన్న వయస్సులోనే పిల్లల్లో నులి పురుగులను నివారిస్తే వ్యాధి నిరోధకత పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయవచ్చు. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థ చిన్నారుల్లో ఆరోగ్యకరమైన లక్షణాలను పెంపొందించేందుకు నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నది.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నులి పురుగుల వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమేనంటున్నారు వైద్యులు. చిన్న పిల్లలు ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడం, శుభ్రమైన నీటిని తాగడం, ఆడుకునేటప్పడు చెప్పులు ధరించడం, ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన అనంతరం చేతులు, కాళ్లు సబ్బుతో కడుక్కోవడం, మంచి ఆహారం తీసుకోవడం, పండ్లు, ఆహార పదార్థాలపై మూతలు ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తే నులి పురుగుల వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు అందించడం ద్వారా కూడా వీటిని నియంత్రించవచ్చు. ఈ మాత్రలతో నులి పురుగులతో పాటు ఏలిక పాములు, కొంకి పురుగులను సైతం నిర్మూలించవచ్చు.
నులి పురుగుల నివారణ మాత్రలను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పిల్లలకు పంపిణీ చేస్తారు. ఐదేండ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో, 6 నుంచి 19 ఏండ్లలోపు వారికి పాఠశాలలు, కళాశాలల్లో అందజేస్తారు. రెండేళ్ల లోపు చిన్నారులకు సగం మాత్ర (200 ఎంజీ) నీటిలో కలిపి తాగించాలి. 2 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలకు ఒక మాత్ర (400 ఎంజీ) వేయించాలి. ఏడాది లోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవద్దు.
మెదక్ జిల్లాలో 1076 అంగన్వాడీ కేంద్రాలు, 1062 పాఠశాలలు, 42 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో ప్రతి విద్యార్థితో పాటు బయట ఉన్న పిల్లలకు సైతం ఈనెల 15న తప్పనిసరిగా మాత్ర అందించి వేసుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు. తద్వారా పిల్లల్లో చురుకుదనం పెరుగుతుందని ఎంతో ఉత్సాహంగా ఉంటారని పేర్కొంటున్నారు. అనివార్య కారణాల వలన మాత్రలు తీసుకోలేని వారికి తిరిగి ఈనెల 22న అందించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. మెదక్ జిల్లాలో 1-19 ఏండ్ల లోపు చిన్నారుల 2,21,132 మంది ఉన్నారు. వీరందరికీ నేటి నుంచి మూడు రోజుల పాటు మాత్రలను వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో పంపిణీ చేస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ మాత్రలను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. భోజనం తరువాత వీటిని వేసుకోవాలి. మాత్రలు వేసుకున్న వారికి ఏదైనా సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలోని వైద్యులను సంప్రదించాలి.
– వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లా వైధ్యాధికారి
నులి పురుగులను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు ప్రతిరోజూ స్నానం చేయాలి. ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మల విసర్జనకు మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలి. పరిశుభ్రమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవాలి. వంటలో తాజా కూరగాయలను మాత్రమే వాడాలి.