కొల్చారం : మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ రైతులు రాస్తోరోకో చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు
మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణం కోసం గతంలో సుమారు 40 కుటుంబాలు కలిసి 30 గుంటలకు పైగా భూమిని ఇచ్చామని తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద మూలమలుపును సరి చేస్తూ జాతీయ రహదారి నిర్మించడానికి తాము భూములు ఇచ్చామని పేర్కొన్నారు. దీనికి బదులుగా అప్పటి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వంపు తిరిగిన పాత రోడ్డును తమను సాగు చేసుకోమని చెప్పారన్నారు. రెండు రోజులలో పాత రోడ్డు కు సంబంధించిన పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు తమకు ఎటువంటి ధ్రువపత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఆ పాత రోడ్డుపై ప్రభుత్వ బోర్డు పాతుతున్నారని మండిపడ్డారు. తాము కోల్పోయిన స్థలాన్ని తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు.
ధర్నా గురించి తెలుసుకున్న స్థానిక ఎస్సై మొయినుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే తహశీల్దార్ కార్యలయానికి వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.