సంగారెడ్డి, జూన్ 13: రోడ్డు ప్రమాదాలపై అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని ఎస్పీ రమణకుమార్ సూచించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రమాదాల నివారణ, మహిళలపై లైంగిక వేధింపులు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆన్లైన్, లాటరీ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తంగా చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు, నిల్వ, సరఫరా చేస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరస్తులను గుర్తించాలన్నారు.
గంజాయి సాగు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావని, ఒకే గ్రామానికి చెందిన వారు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ గ్రామానికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామన్నారు. సమీక్షా సమావేశంలో డీఎస్పీలు భీంరెడ్డి, శ్రీరాం, రఘు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.