కంగ్టి, జూన్ 13: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండుతండా వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండలానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. బాధిత కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి మండలంలోని బోర్గి గ్రామానికి చెందిన విఠల్, శీలాబాయి దంపతుల ఇద్దరు కుమారులు విజయ్ (19), పాండురంగ (13), గాంధీనగర్‌కు చెందిన మరో యువకుడు సతీశ్(18) సోమవారం ఉదయం పిట్లం మీదుగా మెదక్ జిల్లా శంకరంపేటకు బైక్‌పై బయలుదేరారు. పిట్లం మండల శివారులోని ఎన్‌హెచ్ 161 హైవేపై నిజాంసాగర్ వైపు నుంచి వస్తున్న లారీ, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొకరిని బాన్సువాడ ఏరియా దవాఖానకు తరిలించే క్రమంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ దవాఖానకు తరిలించారు.
పిట్లం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు కంగ్టి మండలానికి చెందిన వారు కావడంతో బోర్గి, గాంధీనగర్ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విఠల్, శీలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇందులో ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వీరి మృతిపై కంగ్టి ఎంపీపీ సంగీతా వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కోట లలితా ఆంజనేయులు, సర్పంచ్‌లు జయశ్రీ గజానంద్, విఠల్ సంతాపం వ్యక్తంచేశారు.
పాపన్నపేట్, జూన్ 13: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనా పాపన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎల్లాపూర్ గ్రామ శివారులో ఆదివారం అర్ధ రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్ కుమార్ కథనం మేరకు యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన బాల కిష్టయ్యకు ఇద్దరు కూతుర్లు. చిన్న కూతురు సంగీతను అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ గ్రామానికి చెందిన బాలరాజ్ గౌడుతో వివాహం చేశారు. కుమారులు లేకపోవడంతో అతడిని ఇల్లరికం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు.
బాలరాజ్‌కు ఒక కూతురు అన్విక(3). వీరు మెదక్ మండలం జానకంపల్లిలో పెద్దమ్మ గుడి పండుగకు ఈ నెల 10వ తేదీన వెళ్లారు. తిరిగి అక్కడి నుంచి ఆదివారం రాత్రి యూసుఫ్‌పేటకు బయలుదేరారు. టేక్మాల్ మండలంలోని హసన్ మహ్మద్పల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్ రాత్ల శ్రీకాంత్ మద్యం మత్తులో ఆటో నడిపిస్తున్నాడు. ఎల్లాపూర్ గ్రామ శివారులోకి రాగానే బాలరాజ్ ద్విచక్రవాహనాన్ని మెదక్ వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి.
బాలరాజ్ గౌడ్ కూతురు అన్విక ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో మెదక్ ఏరియా దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ శ్రీకాంత్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాల కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అల్లాదుర్గం, జూన్ 13: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుపకపది. ఏఎస్సై పెంటప్ప కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన మాదారం రాజు (35) పుట్టింటికి వెళ్లిన తన భార్యను తీసుకురావడానికి పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కాయిదంపల్లి శివారులో 161 జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. రాజు నడుముపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.