.హుస్నాబాద్, జూన్ 13: గౌరవెల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులకు మొత్తం పరిహారం ఇచ్చిన తర్వాతనే ఖాళీ చేయిస్తామని, అప్పటి వరకు నిర్వాసితులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం గౌరవెల్లి నిర్వాసితులు హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన వద్దకు చేరుకున్న ఆయన నిర్వాసితులతో చర్చలు జరిపారు. నిర్వాసితుల వెల్లడించిన సమస్యలు, ఇవ్వాల్సిన పరిహారంపై ఆయన సమాధానం ఇచ్చారు.
భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎలాంటి లబ్ధిచేకూర్చాలో అవన్నీ సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. భూసేకరణలో భాగంగా రైతుల వ్యవసాయ భూములకు ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు మొదట 144 మంది ఉండేవారని, అనంతరం 346 మంది కూడా అర్హులు కావడంతో వీరందరికీ సమానంగా పరిహారం ఇచ్చేందుకు జిల్లా స్థాయి అధికారులు అంగీకారం తెలిపినప్పటికీ నిర్వాసితులు ముందుకు రాకపోవడం సరికాదన్నారు.
18 ఏండ్లు నిండిన వారికి రూ.8లక్షల పరిహారం ఇస్తామని స్థానికంగా చర్చలు జరిగినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. పరిహారానికి బదులు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జీవో 68ప్రకారం నిర్వాసితులందరికీ చెల్లింపులు జరిగాయని, మిగతా వారికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నందున నిర్వాసితులు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొని పరిహారం పొందాలని సూచించారు.
కోట్లాది రూపాయలతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారీ మోటర్లు, ఇతర మిషన్లు శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉన్నదనే ట్రయల్ రన్‌కు అధికారులు యత్నిస్తున్నారని తెలిపారు. దీనిని అడ్డుకోవడం సరికాదన్నారు. ట్రయల్న్‌క్రు జరుగుతున్న సర్వేను మూడు రోజులుగా అడ్డుకున్నందుకే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారని, ఈ నేపథ్యంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై వెంటనే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
వీటితోపాటు మరిన్ని అంశాలను నిర్వాసితులకు వివరించగా వారు సంతృప్తి చెందకపోవడంతో పునరాలోచించుకోవాలని చెప్పడంతో పాటు ప్రభుత్వానికి నిర్వాసితుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం తీసుకొని వేలాది మంది రైతులు, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు పనులు కొనసాగేలా నిర్వాసితులు సహకరించాలని కోరారు. ఆయన వెంట స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు.