సిద్దిపేట అర్బన్, జూన్ 10 : తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ అని, రెండు జాతీయ పార్టీలు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు గుడికందుల నరేశ్, ప్రస్తుత పట్టణ అధ్యక్షుడు బయ్యారం యాదగిరి, సీపీఐ నాయకుడు బోయగూడ అశోక్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు పుట్ల ప్రసాద్ ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయినా.. ఏ ప్రభుత్వం చేయలేదని.. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళిత సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్పారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం, దళితబంధుతో దళితుల దశ మారిందన్నారు. ఒకరు పాదయాత్ర..మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారని.. ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ఫేక్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సిద్దిపేట సమగ్ర అభివృద్ధిలో మనమందరం కలిసి పని చేద్దామన్నారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటానని.. వారికి తప్పకుండా సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కిషన్, నాగరాజు, కనకరాజు, కార్తీక్, జహంగీర్, పరశురాములు, రాజేశ్, మహేశ్, అనిల్ పాల్గొన్నారు.