దుబ్బాక టౌన్, జూన్ 10 : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీలోని 16 వార్డులో జరుగుతున్న పనులను కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. వార్డులో ఉన్న చెత్తా చెదారం, మురుగుకాల్వలను శుభ్రం చేసి చెత్తను ఎత్తారు. జరుగుతున్న పనులను పరిశీలించారు. వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ దేవుని లలిత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్, జూన్ 10 : సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో నాలుగో విడత పట్టణ ప్రగతిని కౌన్సిలర్ సాకి బాల్లక్ష్మీఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో పారిశుధ్య కార్మికులతో డ్రైనేజీని శుభ్రం చేయించారు. వార్డు మొత్తం కలియతిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
హుస్నాబాద్‌టౌన్, జూన్ 10: నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా ఆయా వార్డుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్య సూచించారు. స్థానిక 8వ వార్డులో వీధులను శుభ్రం చేయగా, 10వ వార్డులో పిచ్చిమొక్కలు తొలిగించి, మొక్కలు నాటేందుకు స్థలాలను చదును చేయించారు.12వ వార్డులో తాగునీటి బావికి మరమ్మత్తు పనులుచేయించి సున్నాలు వేయించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్య, కౌన్సిలర్లు గోవిందు, రవి, గూళ్ల రాజు, మ్యాదరబోయిన వేణు, ఏఈ సాయిప్రణీత్, ఆర్ఐ కృష్ణ, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవికుమార్,పలువురు వార్డు అధికారులు పాల్గొన్నారు.
కొమురవెల్లి, జూన్ 10 : ఆయా గ్రామాల్లో శ్రమదానం, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని గురువన్నపేటలో పల్లె ప్రగతితో భాగంగా క్రీడా మైదానం కోసం తహసీల్దార్ లక్ష్మీనారాయణ స్థలాన్ని పరిశీలించారు. జడ్పీటీసీ సిలువేరు సిద్ధ్దప్ప, ఎంపీవో మంజుల, ఆర్ఐ సంజీవ్‌కుమార్, ఎంపీటీసీ సాయిమల్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
దుబ్బాక,జూన్10: పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ అన్నారు. దుబ్బాక మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చౌదర్పల్లి, రామక్కపేట, ఆకారం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో భాస్కరశర్మ పర్యవేక్షించారు.
బెజ్జంకి, జూన్ 10: ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి మండలంలో కొనసాగుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ముత్తన్నపేటలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
హుస్నాబాద్‌రూరల్, జూన్ 10: మండలంలోని గాంధీనగర్, తోటపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో అనిత పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్ షెడ్లను సందర్శించి నిర్వహణ తీరుపై సలహాలు, సూచనలు ఇచ్చారు. మీర్జాపూర్, నాగారం, వంగరామయ్యపల్లి గ్రామాల్లో డ్రై డే నిర్వహించారు. హెల్త్ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఖాళీ పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పారబోసి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.