రామాయంపేట, జూన్ 10 : స్త్రీనిధి రుణాలను కిస్తీల వారీగా డబ్బులను చెల్లించిన మాకు నకిలీ రసీదులను ఇచ్చి నట్టేట ముం చిన సీఏ ప్రవీణపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలంటూ సీబీఐ బ్యాంకు ఎదుట శుక్రవారం డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన చేశారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన 34 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు బ్యాంకు అధికారుల వద్దకు చేరుకుని వారి గోడును వివరించారు. నందిగామ గ్రామ సీఏగా ఉన్న ప్రవీణ సుమారు రూ. కోటి 25లక్షలను కాజేసి తాను సొంతంగా వాడుకుని పరారైనట్లు తెలిపారు.
ఎన్నిసార్లు అడిగినా బినామీ పేర్లు చెప్పి తప్పించుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 15రోజుల ముందు నందిగామ గ్రామానికి అధికారులు వచ్చి విచారణ చేపట్టగా, తన దగ్గర డబ్బులు లేవని కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకుని మోసం చేశారని తెలిపిందన్నారు. నేడు రామాయంపేట సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా(సీబీఐ) బ్యాంకుకు పై అధికారులు వస్తున్నారంటే బ్యాంకు వద్దకు చేరుకున్నామన్నారు. తమకు సీఏ ఇచ్చిన నకిలీ రసీదులను విచారణకు వచ్చిన అధికారులకు చూపించామని పేర్కొన్నారు. ఏదేమైనా నందిగామలో ఉన్న 34డ్వాక్రా గ్రూపు సభ్యులను మోసగించి పరారైన సీఏను పట్టుకుని డబ్బులను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక విచారణ అధికారులు సీఏ డ్వాక్రా రుణ గ్రహీతలకు ఇచ్చిన నకిలీ రసీదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డబ్బులు కాజేసిన సీఏను వదిలిపెట్టే ప్రసక్తే లేదని డ్వాక్రా మహిళలు తెలిపారు. ఇందులో సంబంధిత బ్యాంకు అధికారుల చేతివాటం కూడా ఉంటుందన్నారు. 2018 సంవత్సరం నుంచి నందిగామలోనే సీఏ ప్రవీణ సర్వీస్ సెంటర్ నడిపిస్తూ తమ వేలిముద్రలను తీసుకుని చివరకు తమనే మోసగించి డబ్బులను కాజేసిందని తెలిపారు.