మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరుగకుండా పటిష్ట చర్యలు చేపడుతుంది. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌తో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ఇన్విజిలేషన్ విధులు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షను పటిష్టంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
టెట్ పరీక్షకు మొత్తం 14,762మంది హాజరు కానున్నారు. ఇందులో మొదటి పేపర్‌కు 8605మంది అభ్యర్థులు, మధ్యాహ్నం జరిగే రెండో పేపర్‌కు 6,157మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు హాల్‌టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనను అమలు చేస్తుండటంతో గంటముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
20మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించా రు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 240మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది సమన్వయంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా తరగతి గదిలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఆరోగ్య సిబ్బం ది, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత శాఖ కు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రా ల వద్ద 144సెక్షన్ అమలు చేయనున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ, కలెక్టర్ ఆదేశాల మేరకు టీఎస్ టెట్-2022 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో 36మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, 250మంది ఇన్విజిలేటర్లు నియమించాం. పరీక్షలకు మెదక్ ఆర్డీవో నోడల్ అధికారి నియమించబడ్డారు.
– రామేశ్వరప్రసాద్, జిల్లా పరీక్షల సహాయ కమిషనర్