సంగారెడ్డి అర్బన్, జూన్ 10: ఆయుష్ సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలని యునానీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ జహజాది సుల్తానా వైద్యాధికారులకు సూచించారు. నాలుగో విడత ‘ఆయుష్ గ్రామ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన కంది ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిజామియా టీబీ కళాశాలకు చెందిన వైద్యులు, వైద్య విద్యార్థులు యునానీ వైద్య విధానం ద్వారా 167 మందికి పలు పరీక్షలు నిర్వహించి కావాల్సిన వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిబిరాన్ని యునానీ అడిషనల్ డైరెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆర్డీవో కార్యాలయ ఆవరణతో పాటు కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు యోగాసనాల ప్రాముఖ్యతను వివరించి అనుసరించాల్సిన విధానాన్ని చేసి చూపించారు. శిబిరంలో వైద్యులు యాస్మిన్ సిద్ధిఖీ, హఫీజ్, మిరాజ్, వాజీదొద్దీన్, క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ నర్మద, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.