మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. సీజన్లో 1.65లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, 337 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3 లక్షల మెట్రిక్ టన్నులను అధికారులు సేకరించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్‌లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి అనుకున్న సమయంలోనే చివరి గింజ వరకూ కొనుగోలు చేశారు. మొత్తం 67,216 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా, ఇప్పటి వరకు 29,668 మంది రైతుల ఖాతాల్లో రూ.276కోట్ల 63 లక్షల డబ్బులు జమ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన గన్నీ బస్తాలు, లారీలు, కూలీలను సమకూర్చారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు, దుబ్బాక నియోజకర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో కొనుగోళ్లు జోరుగా జరిగాయి.
మెదక్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. యాసంగిలో రికార్డుస్థాయిలో వడ్లు సేకరించి కొనుగోళ్లను పూర్తి చేశారు. అందుకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ఇందులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 236 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వారా 98, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాసంగిలో మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 67,216 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు 29,668 మంది రైతుల ఖాతాల్లో రూ.276 కోట్ల 63 లక్షల డబ్బులు జమ చేశారు. మిగతా డబ్బులను త్వరలో ఖాతాల్లో జమ చేయనున్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంలోనే పూర్తి చేశారు.
మెదక్ జిల్లాలో యాసంగి సీజన్లో గతంలో కంటే వరి సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతులకు పంట చేతికివచ్చే సమయంలోగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మండల, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు, దుబ్బాక నియోజకర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా జరిగాయి.
రాష్ట్రప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ ధాన్యానికి రూ.1940 మద్దతు ధరను అందించగా, మెదక్ జిల్లాలో పెద్ద మొత్తంలో ధాన్యాన్ని సేకరించారు. 337 కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో మొత్తం 67,216 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు 29,668 మంది రైతుల ఖాతాల్లో రూ.276 కోట్ల 63 లక్షలు జమ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాట్ ఎంట్రీలో ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. కోటి గన్నీ బస్తాలను వివిధ కేంద్రాలకు తరలించారు. ఇదిలావుండగా మెదక్ కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోయినా, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించింది. ధాన్యం కొన్న 72 గంటల్లోనే రైతు ఖాతాల్లో ధాన్యం డబ్బులను వేయడం సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సాధ్యమైంది. చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది.
– పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో 337 కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇప్పటి వరకు 29,668 మంది రైతుల ఖాతాల్లో రూ.276 కోట్ల 63 లక్షల డబ్బులను జమ అయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా ప్రతిరోజూ పర్యవేక్షించాం.
– రమేశ్, అదనపు కలెక్టర్ మెదక్