వెల్దుర్తి, జూన్ 10: వెల్దుర్తి పంచాయతీ నిర్వహణ బాగుందని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ అన్నారు. పల్లెనిద్రలో భాగంగా గురువారం రాత్రి వెల్దుర్తి పంచాయతీకి వచ్చిన అతను పంచాయతీ కార్యాలయంలో నిద్రించారు. ఉదయం పంచాయతీ పరిధిలోని శేరీ గ్రామంలో పలు వీధుల్లో, ప్రధాన రోడ్లను పరిశీలించి, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్మూలన, సిబ్బంది పనితీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను వెర్వేరుగా ఇవ్వాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామం మధ్యలో ఉన్న ఆయకట్టు కాలువలో తుంగ, పిచ్చిమొక్కలు, మురికినీరు పేరుకు పోవడంతో వెంటనే తొలగించాలని ఈవో బలరాంరెడ్డికి సూచించారు.
వెల్దుర్తి పట్టణంలో పలు వీధులతో పాటు హనుమాన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉన్న ఇండ్లు, దుకాణాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా మాంసం దుకాణాల్లో పరిశుభ్రత పాటించకపోవడం, మాంసంపై దుమ్ము, ధూళి పడుతుండటంతో దుకాణాదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి వెల్దుర్తిలో మాంసం దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
కిరాణ దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లను, చెత్తను రోడ్డుపై పారబోయడంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి వారికి జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. మురుగు కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై మండిపడి వెంటనే భవన యజమానులకు నోటీసులు ఇచ్చి నిర్మాణాలను కూల్చివేయాలని ఈవో బలరాంరెడ్డిని ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానలో చెత్త ఉండటంతో అక్కడే ఉన్న సిబ్బంది కుమార్‌ను తొలిగించాలని సూచించగా, పట్టించుకోకుండా ఇష్టానురీతిగా మాట్లాడటంతో డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి తక్షణమే కుమార్‌పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు భాగున్నాయని, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సర్పంచ్ భాగ్య మ్మ, ఈవో బలరాంరెడ్డిలను అభినందించారు.
పట్టణంలో వీధులు, మురుగు కాలువలు, మధిర గ్రామాల్లో సైతం పారిశుధ్య నిర్మూలన బాగుందన్నారు. వైకుంఠధామం పైకప్పు రేకులు తరుచూ ఎగిరిపోతున్నాయని, నూతన నిర్మాణానికి నిధులతో పాటు మధిర గ్రామం శేరీలలో వైకుంఠధామం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ భాగ్యమ్మ డీపీవోను కోరగా స్పందించి శేరీలలో నూతన వైకుంఠధామం నిర్మాణానికి నిధులు, వెల్దుర్తి వైకుంఠధామం మరమ్మతుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం వెల్దుర్తి పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, డీఎల్పీవో శ్రీనివాస్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 81 మధిర గ్రామాలు ఉన్నాయని, అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నదన్నారు. పల్లెప్రగతి నిరంతర ప్రకియ అని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు అయితేనే పూర్తి స్థాయిలో విజయవంతం అవుతామన్నారు.
అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారని, మొదటగా మండలానికి రెండు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 1540 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు ఉండగా, ఇప్పటి వరకు 1000 కిలోమీటర్ల మేర శుభ్రం చేశామన్నారు. 996 కిలోమీటర్ల మురుగు కాలువలు ఉండగా, ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల మేరా శుభ్రం చేశామని తెలిపారు.
ప్రైవేటు స్థలాల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం, పిచ్చి మొక్కలను పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రం చేసి, వాటి ఖర్చును సంబంధింత భూ యజమానుల ఖాతాలో నమోదు చేస్తామన్నారు. వర్షాకాలం ముందు ఈ పల్లెప్రగతి పనులు జరుగుతుండటంతో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయని, దీంతో ఎలాంటి సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం లేదన్నారు. డీపీవో వెంట ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంపీవో విఘ్నేశ్వర్, ఏపీవో రాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, నాయకులు నరేందర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.