సిద్దిపేట టౌన్, జూన్ 8: సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. కమిషనర్ కార్యాలయంలో బుధవారం పెండింగ్ కేసులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల లక్ష్యాన్ని ఛేదించినందుకు పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మహిళలకు సంబంధించిన పోక్సో కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు.
గంజాయి కేసుల్లో నేరస్తులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు చేయాలని సూచించారు. దొంగతనం కేసుల్లో, ప్రమాదకరమైన కేసుల్లో అరెస్టు చేసిన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను అన్ని కోణాల్లో పరిశోధన జరిపి పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును రోజూ మానిటరింగ్ చేయాలన్నారు.
వర్టికల్ వారీగా విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించి పనితనాన్ని మెరుగు పర్చాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహించి, లాడ్జీలను అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ మహేందర్, ఏసీపీలు దేవారెడ్డి, రవీంద్ర రాజు, ఫణిందర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, భానుప్రకాశ్, సీఐలు రవికుమార్, జానకీరాంరెడ్డి, రామకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 8 : సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మిస్తున్న భరోసా సెంటర్ పనులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భరోసా సెంటర్ భవనాన్ని నాణ్యతతో నిర్మించాలన్నారు. నిర్మాణానికి ఉపయోగించే స్టీల్, సిమెంట్ పూర్తి నాణ్యతతో ఉండాలని కాంట్రాక్టర్ విష్ణుకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, సిద్దిపేట రూరల్ సీఐ జానకీరామ్‌రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సైలు అమర్‌రెడ్డి, యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.