టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12న పరీక్ష నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 124 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, పేపర్-1లో 16,790 మంది, పేపర్-2లో 12,359 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. సందేహాల నివృత్తి కోసం డీఈవో కార్యాలయంలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఫోన్ నెం.81435 58112ను అందుబాటులో ఉంచారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8 : టెట్ నిర్వహణకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 123 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్షకు సంబంధించి 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16,790 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పేపర్-2 పరీక్షకు సంబంధించి 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 12,359 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు జోగిపేట, అమీన్పూర్, రామచంద్రపురం, పటాన్చెరు, సదాశివపేట, జహీరాబాద్ మండలాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
849 మంది ఇన్విజిలేటర్లు, 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 123 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ నెల 12న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టెట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. సందేహాలకు 81435 58112 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపాలని సూచించారు.
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, హాల్ టికెట్‌తో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు.
జిల్లాలో టెట్ పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఉన్న విద్యా సంస్థల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా గుర్తించాలి. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఎలాంటి మాల్‌ప్రాక్టీసింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
-నాంపల్లి రాజేశ్, డీఈవో, సంగారెడ్డి