సిద్దిపేట టౌన్, ఆగస్టు 21: సమాజ అభివృద్ధి మానవ వనరులపై ఆధారపడి ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య వెంకటేశ్వర్లు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో నిర్మించిన నంద్యాల చంద్రారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నంద్యాల చంద్రారెడ్డి మెమోరియల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రతి కళాశాలల్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రాల అవశ్యకతను ఆయన వివరించారు. మేధాసంపత్తి ఆర్థిక వనరులు వివిధ రూపాల్లో పూర్వ విద్యార్థుల సేవలను కళాశాల అందిపుచ్చకోవాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో తెలంగాణలో తొలిసారిగా మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కళాశాలలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం ఏర్పాటుతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
అనంతరం మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వ్యవప్థాపకుల డాక్టర్ నంద్యాల నరసింహరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి చంద్రారెడ్డి పేరుపై మెమోరియల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రామారావు, రాజేశ్వరరావు, శ్రీనివాస్, అయోధ్యరెడ్డి, భవాని, శ్యాంసుందర్, మహేందర్, బాలచందర్, సునీత, మధుసూదన్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.