న్యాల్కల్, ఆగస్టు17: కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి దవాఖానలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని రుక్మాపూర్ తండాలో జరిగింది. హద్నూర్ ఏఎస్సై వెంకటేశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొగుడంపల్లి మండలం పడియాల్ తండాకు చెందిన చీనాబాయి (35)ని పదేండ్ల క్రితం మండలంలోని రుక్మాపూర్ తండాకు చెందిన కర్ర లక్ష్మణ్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కొంతకాలంగా చీనాబాయి కడుపు నొప్పితో బాధపడుతున్నది.
నొప్పి ఎక్కువ కావడంతో ఈ నెల 11న పురుగు మందు తాగిందిజ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు బీదర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సలు చేసి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
గుమ్మడిదల,ఆగస్టు17: తనకు జన్యు లోపంతో సంతానం పుట్టినందుకు మానసికంగా కుంగిపోయి, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో బుధవారం జరిగింది. ఎస్సై విజయకృష్ణ కథనం ప్రకారం.. బొంతపల్లి గ్రామానికి చెందిన ఇప్ప నర్సింలు అనురాధ దంపతులు. వీరికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. వీరిది మేనరికం కావడంతో వీరికి పుట్టిన సంతానం జన్యు లోపంతో మానసిక అనారోగ్యంతో పుట్టారు. పెద్ద కూతురికి ఏడేండ్ల క్రితం పెండ్లి చేశారు.
ఆమెకు కిడ్నీలు చెడిపోవడంతో ఇబ్బందులు పడి కిడ్నీలు మార్చారు. మిగిలిన ముగ్గురు సంతానం మానసికంగా దివ్యాంగులు కావడంతో వీరిని చూస్తూ రోజూ బాధపడుతుండేది. మానసిక క్షోభను భరించలేక అనురాధ(42) మంగళవారం విషం తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మల్లారెడ్డి దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాపన్నపేట, ఆగస్టు17: మతిస్థిమితం సరిగాలేని గుర్తు తెలియని మహిళ అనారోగ్యంతో మృతి చెందిన ఘటన పాపన్నపేటలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుపాయల ఆలయ సమీపంలో నిర్మిస్తున్న బస్టాండ్ వద్ద సుమారు 45 నుంచి 50 ఏండ్ల వయస్సు గల గుర్తు తెలియని మహిళ కొన్ని రోజులుగా ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో యాచకురాలిగా జీవిస్తున్నది.
రెండు మూడు రోజుల నుంచి అనారోగ్యంతో నీరసించి ఏడుపాయల బస్టాండ్ వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఒంటిపై ఆకుపచ్చ రంగు చీర, బూడిద రంగు జాకెట్టు ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.