ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను రెండు మీటర్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917టీఎంసీలు కాగా,ప్రస్తుతం 28.776 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది.
పుల్కల్, ఆగస్టు5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో సింగూర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి అమాంతం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రెండు రోజులుగా తగ్గిన వరద, ఉన్నటుండి గురువారం నుంచి ప్రాజెక్టులోకి పెరిగింది.
ఈ సందర్భంగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది పరీవాహక ప్రాంతాల్లో మత్స్యకారులు, గొర్లకాపరులు, రైతులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19,477 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంటే, 29,591 క్యూసెక్కుల నీటిని మూడు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 28.776 క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.