హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/ అందోల్, ఆగస్టు 5: దళితబంధు.. ఒక పథకం మాత్రమే కాదని, ఉద్యమమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామానికి చెందిన దళితబంధు పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఆరణ్య భవన్లో మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. అనంతరం మంత్రికి జున్నుపాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.ఏడాదిలో ఎన్నో దళిత కుటుంబాలు ఈ పథకంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని అన్నా రు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకం అమలవుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ పథకంలో గేదెలు పొందిన బుడ్డాయిపల్లి లబ్ధిదారులు ఇంత దూరం తనపై ప్రేమతో జున్ను తీసుకువచ్చారని, వారి అభిమానంతో కడుపు నిండిపోయిందని అన్నారు.
దళితబంధు పథకంతో ఎంతోమంది దళితులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఇలాంటి గొప్ప పథకం అమలు చేయలేదన్నారు. రూ.10 లక్షలతో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని, ఇదంతా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని అన్నారు.
అందోల్ నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో 100 మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జాగృతి నాయకుడు భిక్షపతి, వట్పల్లి జడ్పీటీసీ అపర్ణాశ్రీకాంత్, వరం అధ్యక్షుడు వీరారెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు సాయికుమార్, విఠల్, సదానందం, షాబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.