సిద్దిపేట, ఆగస్టు 4 : జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, దేశంలోనే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు అందించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని అక్షయ గ్రాండ్ హోటల్లో గురువారం ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, నిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నిత్య విద్యార్థుల్లాగా ఉంటేనే ఈ వృత్తిలో రాణిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించినట్లు తెలిపారు. మీడియాలో కొత్త పోకడలు వచ్చాయని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. జర్నలిస్టులకు పండుగలు, పబ్బాలు ఏమీ ఉందవని, నిత్యం పనిచేయాల్సి ఉంటుందన్నారు.
జర్నలిస్టులు సమయానికి భోజనం చేయకపోవడంతో జబ్బులకు గురవుతున్నారని, ప్రతిరోజు గంట సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించి వాకింగ్, యోగా, ప్రాణాయామం చేయాలని సూచించారు. త్వరలోనే జర్నలిస్టుల కోసం మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. యోగా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. తాను ప్రతిరోజు యోగా చేస్తానని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, దానిని కాపాడుకోవాలన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం కాకముందే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశామని, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన కోరారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు రామలింగారెడ్డి, నాగరాజును కోల్పోయామని వారి జ్ఞాపకాలను గుర్తుచేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకులను అందించామన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం, డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం తన సహకారాన్ని అందిస్తానన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధిలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు ఉద్యమకారులుగా, మిత్రులుగా అందించిన సహకారం చాలా గొప్పదన్నారు. సిద్దిపేట ఖ్యాతిని దేశ స్థాయికి చేరడంలో అన్ని రంగాల్లో మోడల్‌గా నిలువడంలో జర్నలిస్టుల పాత్ర ఉందన్నారు.
నేడు సిద్దిపేట వాటర్ హబ్‌గా తయారైందన్నారు. జర్నలిస్టులు మరణిస్తే ప్రెస్ అకాడమీ ద్వారా లక్ష రూపాయలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు, కరోనా బారిన పడిన 4 వేల మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించినట్లు తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌ను రూ.30 లక్షలతో ఆధునీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఆర్వో రవిమార్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అంజయ్య, రంగాచారి, కత్తుల శ్రీనివాస్‌రెడ్డి, సుభాశ్, రాజిరెడ్డి, బింగి శ్రీనివాస్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.